Reading Time: 2 minutes
Shreyas Iyer Tops Pbks And Kkr Captaincy Records With Highest Win Percentage In Ipl

Shreyas Iyer Tops PBKS and KKR Captaincy Records: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో కెప్టెన్సీ అనేది ప్రత్యేకం. ఇక్కడ నిరూపించుకుంటే.. భారత జట్టును సారథ్యం వహించే అవకాశాలు మెరుగవుతాయి. కెప్టెన్సీ అంటే కేవలం జట్టును నడిపించడం మాత్రమే కాదు.. ఒత్తిడిలో సరైన నిర్ణయాలు తీసుకుని టీంను విజయపథంలో నడిపించడం కూడా చాలా ముఖ్యం. ఈ విషయంలో భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తనదైన ముద్ర వేస్తున్నాడు. శ్రేయస్ నాయకత్వం వహించిన జట్లలో విజయం శాతం చూస్తే.. అతడు ఎంత సమర్థవంతమైన కెప్టెన్ అన్నది స్పష్టంగా తెలుస్తోంది.

పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ అద్భుత రికార్డు నమోదు చేశాడు. అతడి నాయకత్వంలో జట్టు 61.11 శాతం విజయాలు సాధించడం విశేషం. ఇది పంజాబ్ కింగ్స్ చరిత్రలోనే అత్యధికం. ఈ జాబితాలో శ్రేయాస్ తర్వాతి స్థానాల్లో యువరాజ్ సింగ్ (58.6), జార్జ్ బేలీ (51.4), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (50.0), మయాంక్ అగర్వాల్ (50.0) ఉన్నారు. ఈ గణాంకాలు చూస్తే పంజాబ్ జట్టును అయ్యర్ ఎంత అద్భుతంగా నడిపిస్తున్నాడో అర్థమవుతుంది. కొన్నేళ్ల పాటు సెమీస్ దాటని పంజాబ్ టీంను శ్రేయస్ ఐపీఎల్ 2025లో ఫైనల్ వరకు చేర్చాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్‌గా కూడా శ్రేయస్ అయ్యర్ తన ప్రతిభను నిరూపించాడు. కేకేఆర్ తరఫున అతడి విజయం శాతం 58.6గా ఉంది. ఇది కూడా కేకేఆర్ చరిత్రలో టాప్‌లోనే ఉంది. గౌతమ్ గంభీర్ (56.5), దినేష్ కార్తిక్ (51.3), సౌరవ్ గంగూలీ (48.1), ఇయాన్ మోర్గాన్ (45.8) వంటి దిగ్గజ కెప్టెన్లను కూడా అయ్యర్ వెనక్కి నెట్టడం విశేషం. శ్రేయస్ సారథ్యంలో కేకేఆర్ టైటిల్స్ కూడా గెలుచుకుంది.

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ముఖ్యంగా కనిపించేది అతడి ప్రశాంత స్వభావం. ఆటపై స్పష్టమైన అవగాహన, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు బౌలర్లను ఉపయోగించడం, ఫీల్డింగ్ సెట్టింగ్స్ మార్చడం వంటి అంశాల్లో కూడా ఎంతో తెలివిగా వ్యవహరిస్తాడు. యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచి వారికి అవకాశాలు ఇవ్వడం కూడా శ్రేయస్ నాయకత్వంలో మరో ప్రత్యేకత అనే చెప్పాలి. ఇప్పటికే రెండు జట్లకు కెప్టెన్‌గా నిలిచి టాప్ విజయం శాతంతో చరిత్ర సృష్టించిన శ్రేయస్.. భవిష్యత్తులో ఐపీఎల్‌లో మరిన్ని విజయాలు సాధించడం ఖాయం. అతడి నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో టైటిల్ గెలుస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.