Reading Time: < 1 minute

హైదరాబాద్:  కేవలం సిఎం,సిఎస్ మాత్రమే అధికారులను మాత్రమే బదిలీ చేస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కుటుంబాలను ఇబ్బంది పెట్టేలా రాతలు రాయొద్దని హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…మహిళా ఐఎస్ఎస్ పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత నల్గొండకు నలుగురు కలెక్టర్ల మారారని, తన జిల్లాలోనే కాదు..మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియకుండానే బదిలీలు జరుగుతాయని తెలియజేశారు. మంత్రులపై ఇటీవల వస్తున్న ఆరోపణల్ని కోమటి రెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కలెక్టర్ల బదిలీలు, పదోన్నతులు సర్వసాధారణం అని.. అధికారుల మీద అభాండాలు వేయటం సరికాదని అన్నారు.

రేటింగ్ లు, వ్యూస్ కోసం దుష్ప్రచారం సరికాదని, అధికారుల కుటుంబాల గౌరవం గురించి కూడా ఆలోచించాలని సూచించారు. సినిమా పరిశ్రమపై ఇంకా దృష్టి పెట్టలేదని, పుష్ప సినిమా తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదని చెప్పానని అన్నారు. బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు కోసం తన వద్దకు రావొద్దని చెప్పానని, సినీ పరిశ్రమ గురించి పట్టించుకోవడం మానేశానని, టిక్కెట్ల ధరల పెంపు సంబంధించి ఏ ఫైల్ తన వద్దకు రాలేదని చెప్పారు. బెనిఫిట్ షోల కోసం తనను ఎవరూ సంప్రదించలేదని, సంధ్య థియేటర్ బాధిత కుటుంబానికి రూ. 25 లక్షలు అందించానని తెలియజేశారు. బాధిత బాలుడిని చదివిస్తానని చెప్పానని, చిత్ర పరిశ్రమ సమస్యల కంటే ప్రజల సంక్షేమం, అభివృద్ధి పనులే తనకు ప్రాధాన్యత ఇచ్చానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.