
పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులు అవుతారని.. తల్లిదండ్రులు గంపెడు ఆశలతో పెద్ద కాలేజీల్లో చేర్పించి, లక్షల రూపాయలు ఫీజులు కట్టి చదివిస్తుంటారు. అయితే వారి పిల్లలు మాత్రం ఫోన్లలో రీల్స్ చేయడానికి, సోషల్ మీడియాలో గంటల కొద్ది గడపడానికి ఆసక్తి చూపుతూ చేజేతులా భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉంటారు. తీరా పరీక్షల సమయంలో అడ్డదారులు తొక్కుతుంటారు. సాధారణంగా ఇలా టైం పాస్ చేసే విద్యార్ధులు ఆన్సర్ షీట్లలో తమను పాస్ చేయాలని రకరకాలు వేడుకుంటూ ఉంటారు. కొందరు ఆన్సర్ షీట్లలో డబ్బులు పెట్టి పాస్ చేయమని బతామాలుకుంటే.. మరికొందరు సినిమా స్టోరీలు, పాటలు రాసి పేజీలు నింపేస్తుంటారు.
అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు పూర్తవడంతో సమాధాన పత్రాల మూల్యాంకనం చేపట్టారు. ఈ క్రమంలో పేపర్లు దిద్దుతున్న మాస్టర్లకు ఇలాంటి మరో ఆణిముత్యం తగిలింది. ఓ విద్యార్ధి ఆన్సర్ షీట్లో రాసిన సమాధానం, గీసిన బొమ్మలు ఎగ్జామినర్‌కు దిమ్మతిరిగిపోయింది. దీంతో వెంటనే సదరు ఆన్సర్ షీట్‌ను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం రాశాడంటే..
నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న..
నన్ను పాస్ చేయండి సార్
నేను చదువుకున్నవి పరీక్షలో రాలేదు, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా.. మీరే నా దేవుడు సార్
ఇంటర్ పరీక్షల్లో ఒక విద్యార్థి మూల్యాంకుడిని వేడుకుంటూ రాసిన లేఖ వైరల్ pic.twitter.com/kokhSgiw3V
— Telugu Scribe (@TeluguScribe) March 22, 2026
ఈ ఆన్సర్ షీట్‌లో సదరు విద్యార్థి.. ‘సార్.. నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న. నన్ను పాస్ చేయండి సార్. నేను చదువుకున్నవి పరీక్షలో రాలేదు, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా.. మీరే నా దేవుడు సార్. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి’ అని వేడుకున్నాడు. అంతటితో ఆగకుండా ఓ గురువు కాళ్లపై శిష్యుడు బోర్లా పడి నమస్కరిస్తున్నట్టుగా బొమ్మ గీశాడు. గురువు బొమ్మ దగ్గర ‘సార్’ అని, శిష్యుడి బొమ్మ దగ్గర’నేను’ అని రాసి సదరు విద్యార్థి తన టాలెంట్ చూపించాడు. ఈ మేరకు ఇంటర్ పరీక్షల్లో విద్యార్థి మూల్యాంకుడిని వేడుకుంటూ రాసిన లేఖ నెట్టింట వైరల్ కావడతో నెటిజన్లు పలు విధాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఎంతకు తెగించార్రా అని ఓ యూజర్ కామెంట్ చేయగా.. మరోకరు ‘ఇప్పుడు ఫెయిల్ ఐతే ఏంటంట? నీకు అర్థం అవుతుందా..’, ‘వీడు పాసైన ఫెయిలైన జబర్దస్త్ లాంటి షోకి వెళ్తే ఫేమస్ అవుతాడు’, ‘ఇచ్చేయండి సార్ పాస్ మార్కులు ఇచ్చేయండి’ అంటూ మీమ్స్‌తో కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.