Reading Time: < 1 minute
Suryakumar Yadav Explains Why Ishan Kishan Kept Wickets Over Sanju Samson

న్యూజీలాండ్‌తో జరిగిన ఐదు టీ20 మ్యాచ్‌లో వికెట్‌ కీపింగ్ బాధ్యతను ఇషాన్ కిషన్‌ నిర్వర్తించాడు. సిరీస్‌లోని మొదటి నాలుగు మ్యాచ్‌లలో కీపర్‌ బాధ్యతలను సంజూ శాంసన్ నిర్వర్తించాడు. చివరి మ్యాచ్‌లో కిషన్‌కు అప్పగించడంపై భారత అభిమానుల్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. సంజూ ఉన్నా కూడా కిషన్‌ ఎందుకు కీపింగ్ చేశాడు, ఇక సంజూ టీ20 వరల్డ్ కప్‌ 2026లో ఆడడు అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టత ఇచ్చాడు.

మ్యాచ్ అనంతరం ఓ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సూర్యకుమార్ యాదవ్ సమాధానం ఇచ్చాడు. ‘ఈరోజు మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఉన్నప్పటికీ.. ఇషాన్ కిషన్ ఎందుకు వికెట్‌ కీపింగ్ చేశాడు?’ అని ప్రశ్నించగా.. సిరీస్ ప్రారంభంలోనే తీసుకున్న నిర్ణయాన్ని వివరించాడు. ‘ఈ సిరీస్ ఆరంభం నుంచి మేం ఓ ప్లాన్‌తో ముందుకెళ్లాం. సంజూ శాంసన్ మూడు మ్యాచ్‌లకు వికెట్‌ కీపింగ్ చేయాలి, ఇషాన్ కిషన్ ఒక మ్యాచ్‌కు చేయాలి అనేది మా ఆలోచన. గత మ్యాచ్‌లో కిషన్ గాయంతో ఆడలేకపోయాడు. దాంతో సంజూనే వికెట్‌ కీపింగ్ చేశాడు. ముందుగా నిర్ణయించిన ప్లాన్ ప్రకారం ఈ మ్యాచ్‌లో కిషన్‌ కీపింగ్ చేశాడు’ అని చెప్పాడు.

Also Read: Chiranjeevi: రామ్‌చరణ్- ఉపాసనకు కవలలు.. మెగాస్టార్‌ చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు!

సూర్యకుమార్ యాదవ్ వివరణతో ఇషాన్ కిషన్ వికెట్‌ కీపింగ్‌పై ఉన్న సందేహాలకు తెరపడింది. టీమిండియా మేనేజ్‌మెంట్ ముందస్తు ప్రణాళిక ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటోందని, వ్యక్తిగత అంశాల కంటే జట్టు అవసరాలకే ప్రాధాన్యం ఇస్తోందని సూర్య వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది. దీంతో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ పాత్రలపై జరుగుతున్న చర్చలకు కొంతవరకు సమాధానం లభించినట్లైంది. న్యూజీలాండ్‌ సిరీస్‌లోని 5 మ్యాచ్‌ల్లో సంజూ 10, 6, 0, 24, 6 స్కోర్లు చేశాడు. దాంతో ప్రపంచకప్‌లో అతడికి చోటు దక్కడం కష్టమే అని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.