
టి-20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి భారత జట్టును విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఓ వైపు జట్టు విజయాల బాటలో నడుస్తుంటే సూర్య మాత్రం ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డాడు. అయితే న్యూజిలాండ్‌తో జరుగుతున్న టి-20 సిరీస్‌లో మాత్రం సూర్య తిరిగి పుంజుకున్నాడు. రెండు, మూడు టి-20ల్లో హాఫ్ సెంచరీలు చేసి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో త్వరలో ప్రారంభమయ్యే టి-20 ప్రపంచకప్‌లో సూర్య కెప్టెన్‌గా రాణించడం మాత్రమే కాదు.. బ్యాట్‌తోనూ విరుచుకుపడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
అయితే ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ సూర్య కెప్టెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకు కెప్టెన్‌గా రావాల్సిన క్రెడిట్ ఇవ్వడం లేదని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు. సూర్య కెప్టెన్సీ స్టైల్‌లో రోహిత్ శర్మ ఛాయలు కనిపిస్తున్నాయని అన్నాడు. ‘‘సూర్యకు కెప్టెన్‌గా అద్భుతమైన రికార్డు ఉంది. టి-20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా అతడి విజయాల శాతం 84. ఇది చాలా ఎక్కువ. కానీ, మనం సూర్యకుమార్ యాదవ్‌కు ఇవ్వాల్సినంత క్రెడిట్ ఇవ్వడం లేదు. అతడు బౌలర్ల కెప్టెన్. అతడిలో రోహిత్ శర్మ ఛాయలున్నాయి. అతడు బౌలర్లపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు. జట్టు కోసం సరైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటాడు’’ అని పఠాన్ పేర్కొన్నాడు.
ఇక సూర్య 2025లో అతడి స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోయాడు. గత సంవత్సరంలో 21 ఇన్నింగ్స్‌లో కేవలం 218 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై ఇర్ఫాన్ మాట్లాడుతూ.. ‘‘సూర్య సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. కెప్టెన్‌గా అతడు కచ్చితంగా ప్రపంచకప్ ఆడుతాడు. కానీ బ్యాటర్‌గా సూర్య పరుగులు రాబట్టాల్సి ఉంది. అది అతడికి ఎంతో కీలకం’’ అని అన్నాడు.