
ఉత్తరప్రదేశ్‌లో 2021లో అమలులోకి వచ్చిన చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టం బలవంతంగా, మోసం చేసి లేదా ప్రలోభాలకు గురిచేసి మత మార్పిడి చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది. ముఖ్యంగా మైనర్లు, మహిళలు లేదా ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన వారిని మార్చడానికి ప్రయత్నిస్తే శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మొరాదాబాద్ జిల్లా బిలారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 16 ఏళ్ల హిందూ బాలికను బలవంతంగా బురఖా ధరింపజేయడానికి ప్రయత్నించారని, ఆమెను మత మార్పిడికి ప్రోత్సహించారని ఆరోపణలు వచ్చాయి. బాధిత బాలిక సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టం-2021 సెక్షన్ 3 కింద ఐదుగురు ముస్లిం బాలికలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సంఘటన డిసెంబర్ 12, 2025న జరిగింది. అయితే శుక్రవారం బాలిక సోదరుడు దక్ష్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.
నిందితులు , బాధిత బాలిక అందరూ స్నేహితులని, ఒకే కోచింగ్ సెంటర్‌కు వెళ్లేవారని పోలీసులు గుర్తించారు. ఆ బాలికలు రెస్టారెంట్‌కు వెళ్తుండగా బాధిత అమ్మాయి తన సోదరుడికి కనబడకుండా ఉండటానికి తన స్నేహితురాలి బురఖాను ధరించి ఉండవచ్చు అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. నిందితులుగా పేర్కొనబడిన వారు మైనర్లు 15 నుండి 17 ఏళ్ల లోపు కావడంతో, పోలీసులు వారిని వెంటనే అదుపులోకి తీసుకోలేదు. చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మైనర్లను మత మార్పిడికి ప్రేరేపిస్తే కనీసం 5 ఏళ్ల నుండి 14 ఏళ్ల వరకు కఠిన జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆ బాలికల ఉద్దేశం మత మార్పిడి చేయడమా లేక కేవలం తమ సోదరుడి నుండి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నమా అనేది పూర్తి విచారణలో తేలాల్సి ఉంది.