Reading Time: < 1 minute

హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ పాలనలోనే ఫోన్ ట్యాపింగ్ అనేది వివాదాస్పదం అయిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎన్నో ఏళ్లుగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ పాలనలో ఫోన్లలో మాట్లాడేందుకు బిఆర్ఎస్ నేతలే భయపడేవారని, ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చాలా మంది నేతలు గతంలో చెప్పారని తెలియజేశారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే.. చేసి ఉండొచ్చని స్వయంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఒప్పుకున్నారని, ఫోన్ ట్యాపింగ్ కేసులో కెటిఆర్ కేవలం సాక్షిగానే విచారణకు పిలిచారని అన్నారు. కెసిఆర్ హయాంలో ట్యాపింగ్ ప్రజల స్వేచ్ఛను హరించేలా జరిగిందని, నేతలు, వ్యాపారాలు మాట్లాడుకున్నది కూడా దుర్మార్గంగా విన్నారని జూపల్లి విమర్శించారు. రాజకీయ కక్ష సాధించాలనుకుంటే కెసిఆర్, కెటిఆర్ అరెస్టు అయ్యేవాళ్లని, ప్రజాధనంతో నడిచే ఎస్ఐబిని సొంత అవసరాలకు వాడుకుని దుర్వినియోగం చేశారని, బిఆర్ఎస్ పాటు కాంగ్రెస్, బిజెపి నేతలను కూడా విచారణకు పిలిచారని అన్నారు. బిఆర్ఎస్ నేతలను రాష్ట్ర ప్రజలు విశ్వసించరని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.