Reading Time: 2 minutes

హైదరాబాద్: తెలంగాణను దేశంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దాలని మాజీ సిఎం కెసిఆర్ కృషి చేశారని బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అలవికాని హామీలు ఇచ్చి సిఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీష్ రావు, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎమ్మెల్సీలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. కేసులు పెడుతున్నా.. తెలంగాణ ప్రజల కోసమే బిఆర్ఎస్ నేతలు పోరాటం చేస్తున్నారని తెలియజేశారు. రెండేళ్లుగా ఫోన్ ట్యాపింగ్ పేరుతో కేసులు పెడుతున్నారని, రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కెటిఆర్ కు సంబంధం లేదని, ఈ కేసుతో సంబంధం లేదని తమ పార్టీ నేతలను పిలిచి విచారణ చేయడాన్ని బిఆర్ఎస్ ఖండిస్తోందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ నేరం కాదు.. ఇది చట్టబద్ధమేనని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. దేశ భద్రత కోసం, ప్రజల రక్షణ కోసం ఫోన్ ట్యాపింగ్ చేస్తారని, స్వాతంత్ర్యం రాకముందు నుంచి ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధంగా ఉందని అన్నారు.

 మాజీ అధికారిగా చెప్తున్నా.. ట్యాపింగ్ నేరం కాదని పార్లమెంట్ సాక్షిగా దివంగత ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారని, ఫోన్ ట్యాపింగ్ అనేది దేశరక్షణ కోసం పోలీసులు గోప్యంగా చేసే కారక్రమం అని.. అన్నారు. స్వాతంత్ర్యం రాకముందే నుంచి ట్యాపింగ్ చట్టబద్దంగా ఉందని.. చట్టబద్దంగా జరుగుతున్న ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి బజారున పడేశారని ధ్వజమెత్తారు. ఎలా సమాచారం సేకరించారో అధికారులు ప్రధానికి, సిఎంకు, నేతలకు చెప్పరని, ట్యాపింగ్ అనేది పోలీసుల అంతర్గత వ్యవహారమని అన్నారు. అందులో భాగంగానే మొన్న హరీష్ రావును, ఇవాళ కెటిఆర్ ను వేధిస్తున్నారని, ట్యాపింగ్ తప్పు కాదని ఎన్నో సందర్భాల్లో రేవంత్ రెడ్డే చెప్పారని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి ఏం చేయమంటే అది అధికారులు చేస్తున్నారని, రాజకీయ వికృత క్రీడకు, ప్రతిపక్షాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు ట్యాపింగ్ వ్యవహారాన్ని వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వ్యక్తిత్వాన్ని హననం చేసినా.. రేవంత్ సర్కార్ దోపిడీని బయటపెడుతునే ఉంటామని సూచించారు.  దేశ రక్షణ గురించి రేవంత్ రెడ్డికి ఏమైనా బాధ్యత ఉందా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడల్లో భాగస్వాములైన అధికారులను మాత్రం వదిలేది లేదని హెచ్చరించారు. పోలీసులతో సంబంధం లేని శాఖలకు మంత్రులుగా పనిచేసిన కెటిఆర్, హరీష్ రావుకు ట్యాపింగ్ తో సంబంధం ఏంటీ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.