Reading Time: < 1 minute

అమరావతి: ఎపి మంత్రి అనగాని సత్యప్రసాద్ సంస్కారం మరిచి మాట్లాడుతున్నారని వైసిపి మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి పై అవాకులు, చవాకులు పేల్చుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనగాని ఎపి మంత్రి కావడం మన ఖర్మ అని విమర్శించారు. పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకున్నారని, ఆ పాస్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ఓపెన్ కావడం లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వే చేసి ఒక్క పాస్ పుస్తకం అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. జగన్ హయాంలో ఇచ్చిన పాస్ పుస్తకాలు తీసుకుని కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నారని పేర్నినాని మండిపడ్డారు. రూ. 25 కోట్లు ఇస్తే పార్టీ మారతానని అనగాని సత్యప్రసాద్ అన్నారని, రూ.25 కోట్లు ఇవ్వడానికి ఆనాడు వైఎస్ జగన్ అంగీకరించలేదని తెలియజేశారు.

పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో తీయడం తప్ప.. కూటమి ప్రభుత్వం ఏం చేసింది..? అని.. రెవెన్యూ వ్యవస్థ గురించి రెవెన్యూ మంత్రికి ఏమైనా తెలుసా? అని ప్రశ్నించారు. తక్కెళ్ల పాడులో కూటమి ప్రభుత్వం మొదలు పెట్టిన సర్వే ఎందుకు కొనసాగించడం లేదు? అని.. రెండెళ్లలో ఎవరి సమస్య తీర్చారు? అని నిలదీశారు. వైఎస్ జగన్ చేపట్టిన భూసర్వేను మీరెందుకు ఫాలో అవుతున్నారు? అని జగన్ నిర్ణయాలు వాడుకుంటూ.. ఆయనపైనే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ 6 వేల గ్రామాల్లో సమగ్ర భూసర్వే పూర్తి చేశారని, 6వేల గ్రామాల్లో సర్వే కోసం వాడిన ఎక్విప్ మెంట్ నే ఎపి సిఎం చంద్రబాబు నాయుడు వాడుతున్నారని పేర్ని నాని దుయ్యబట్టారు.