Reading Time: 3 minutes

కులం పునాదుల మీద జాతిని, నీతిని నిర్మించలేమని బాబాసాహేబ్ అంబేద్కర్ ఏనాడో చెప్పారు. ఈ భారతదేశం అంటేనే కులాలు… కుల ఆధిపత్యాలు. అటువంటి కులరక్కసి వందేళ్లకు దగ్గరకు కావొస్తున్నా.. ప్రపంచం అంతా ఆధునికంగా దూసుకుపోతున్న కులం మన దేశంలో అవకాశాలనే కాదు.. మనుషుల ప్రాణాలను తీసేంత కారణం అవుతోంది. కులం కట్టుబాట్ల పేరుతో ఇంకా వేధింపులు భరించలేక భయంతో తలవంచుకు బతుకుతున్న పరిస్థితులు. కులం మాటను ధిక్కరిస్తే… కాటికి మోయడానికి శవాన్ని తీసుకెళ్లడమే కాదు.. ఆ కులానికి సంబంధించిన శ్మశానంలో దహన సంస్కారాలు చేయడానికి వీలు లేదని కర్కషత్వంగా ప్రవర్తించే కులరాక్షసత్వంపై.. కులం పేరిట జరుగుతున్న దాడులు, హత్యలపై దండోరా మోగించారు సినీ దర్శకుడు మురళీకాంత్. ఆయన చేసిన ప్రయోగం నిజంగా చాలా గొప్పది. సాహసంతో కూడినదని చెప్పొచ్చు.

కులం… ఇది రెండు అక్షరాలే కానీ దాని వెనుక అంతులేని ఆవేదనలు ఉంటాయి. అయితే ఆ ఆవేదనలు బయటకు కన్పించకుండా ఎలా కనుమరుగు చేస్తున్నారో.. పల్లె మనుషుల్లో కులం ఎంత చిచ్చురేపుతోందో దండోరా సినిమాలో దర్శకుడు చూపగలిగారు. నిజంగా ఈ దేశంలో ప్రతిభ ఎంత గొప్పగా ఉన్నా చివరికి దానికి కొలమానం కులం అవుతుందే. ఎంత గొప్ప మనసు ఉన్నా .. గొప్ప చదువు ఉన్నా కులం రాక్షసత్వంపై అవేమీ పనిచేయవు. పల్లెల్లో నిత్యం జరిగే సంఘటనలనే అతి సాధారణంగా సినిమాలో చూపారు. కానీ ఆ దండోరా దగా పడ్డ గుండెల ఆవేదనలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ప్రతీ మనిషి జీవితంలో పుట్టుక, మరణం సాధారణం. అయితే తక్కువ కులంలో పుట్టినంత మాత్రాన తరతరాలుగా చీదరించుకునే పరిస్థితి. తక్కువ కులంలో పుట్టి గొప్ప కొలువు, గౌరవం ఉన్నా.. ఆ మనిషికి గౌరవించబడకపోవడానికి కారణం చూపగలిగారు. తరతరాల ఆచారాలే తప్ప.. కింది కులం వారి ఆలోచనలకు విలువనీయని పరిస్థితిని చక్కగా వివరించారు. మనిషి పుట్టుక ఎటువంటి అవకాశాలకు దగ్గర చేస్తుందో.. కింది వర్గాలను ఎలా దూరం చేస్తుందో తెలిపే ప్రయత్నం గొప్పగా చేశారు. ఓ కింది కులం వారికి తమ శ్మశానంలో దహనం చేసే అవకాశం లేకపోగా.. గుడి మైలపడిపోతదని భావించి అవతలి వైపు నుంచి తిప్పి పంపడమో.. ఊరి అవతలి నుంచి పంపడమో చేస్తుంటారు.. అటువంటి సన్నివేశం గుండెలను గాయం చేస్నిట్లు చేస్తుంది. అటువంటి అనేక సంఘటనలు, యదార్థ ఘటనలు ప్రస్తుతం సమాజంలో ఇంకా చీకటిలో ఉన్నట్లుగా బయటపడనివి ఎన్నో ఉన్నాయి.

రెండు స్వచ్ఛమైన మనసులు కలిసి.. కులాలకు అతీతంగా కలిసిన ఆ మనసులను మూర్ఖత్వంగా విడగొట్టే ప్రయత్నంలో మనుషులను పొట్టన పెట్టుకోవడానికి వెనుకాడడం లేదు. కులం తక్కువోడికి తమ బిడ్డను ఇస్తే నలుగురిలో ఎలా తిరగగలను అని మనుషులను ద్వేషింవడమే కాదు.. హత్య చేయడమే మంచిది అన్నట్లుగా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను కళ్లకు చూపించారు. మీరు ఎంత గొప్ప చదువులు చదివినా.. ఎంత ఆస్తి ఉన్నా.. పుట్టిన పుట్టుక మారదంటూ తాతల నాటి బానిసత్వాన్ని చూస్తున్నారే తప్ప కింది కులాల్లోని గొప్ప మనసులను అర్థం చేసుకునే స్థితిలో లేరు. రెండు కులాలు కలిస్తేనే పెళ్లి తప్ప.. పెళ్లికి రెండు మనసులు కలిస్తే సరిపోదు.. రెండు కులాలు కూడా కలవాలి లేకుంటే ఎంతకైనా తెగించేందుకు సిద్ధం అవుతున్నారు. కులం బలం అవ్వాలి అంతే గానీ పెనుభూతంలా మారకూడదు. అటువంటి కులరాక్షత్వంపై తెలంగాణ యాసభాషలో దండోరా ఆవేదనల గుండెలను ఆవిష్కరించింది.

కులం పేరుతో జరిగే గాయాలు… కులం ఆధిపత్యం దాడిలో బలయ్యే జీవితాల యెథలను కళ్లారా చూపగలిగారు. కుల వివక్ష తీవ్రంగా ఉన్న రోజులను, కుల కట్టుబాట్ల వల్ల విచ్ఛిన్నం అవుతున్న కుటుంబాలను, పల్లెలను వీడి పట్టణాలకే పరిమితమయ్యేలా కుల రాక్షసత్వాన్ని వివరించగలిగారు. కులం కేవలం కింది వర్గాలనే కాదు ఉన్నత వర్గాల్లోనూ కట్టుబాట్ల పేరిట ఎంత భయపెట్టిందో అర్థం అవుతుంది.

కులానికి ఎదురు తిరిగితే.. కులం మాట వినకపోతే ఆఖరి ప్రయాణం అంత్యక్రియలకు కూడా షరతులు విధిస్తూ రాక్షస ఆనందాన్ని పొందిన విధానం.. చైతన్యం కలిగిన, సమాజాన్ని ప్రశ్నించే సత్తా కలిగిన వారుంటే కుల కట్టుబాట్ల పేరుతో వారిని వెలేయడం నాటి అనాగరిక కుల రక్కసి కన్పిస్తుంది. కులం అనే గర్వం ఆ మనిషి.. ఆ కుటుంబాన్ని ఎంత ఛిన్నాభిన్నం చేస్తుందో అద్భుతంగా చూపగలిగారు.

ఎక్కువ కులం అమ్మాయిని ప్రేమించినందుకు తక్కువ కులం వాడంటూ హత్య చేసి తమ కులం గొప్ప కులం అని ఆధిపత్యాన్ని చాటుకోవడం గొప్ప అయింది. కులం సమాజంలో బలం అవ్వాలి.. అంతేగానీ ఆవేదనలకు కారణం కాకూడదు. అటువంటి అనేక ఆవేదనలకు దండోరా సాక్ష్యంగా నిలిచింది. కుల ఆధిపత్యం వల్ల కన్నతల్లి లాంటి పల్లెలనే ద్వేషించేలా కుల రాక్షసత్వం ఏవిధంగా ఉంటుందో చూపగలిగారు. అందుకే పల్లెలకు దూరంగా చదువుకున్న వారంతా వెళ్లిపోయి ఊళ్లంటేనే అయిష్టతగా మార్చివేసింది. అటువంటి సమయంలో కుల వివక్షపై అవగాహన సమావేశాల్లోనూ అంబేద్కర్, పెరియర్, జ్యోతిరావు ఫూలే వంటి సామాజిక శక్తుల పేర్లు తీసుకొని సమసమాజం కోసం ఎలా కొట్లాడాలో నేర్పే ప్రసంగం ఆసక్తిని కలిగిస్తుంది. దర్శకుడు ఈ విషయంలో పెద్ద సాహసమే చేశారని చెప్పవచ్చు. మహనీయుల పేర్లను సినిమాలో చాలా అరుదుగా వాడుకునే సందర్భం నుంచే వారి మాటలను విద్యార్థులకు ప్రసంగాల పేరిట విన్పించి నేటి తరానికి ఓ సందేశాన్ని ఇచ్చినట్లు చేశారు.

చదవండి పిచ్చిపట్టినట్లు చదవండి.. ఏది తప్పనిపిస్తే దానిని నిలదీయండి అంటూ.. బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటేనే రాజకీయం తెలుస్తది. రాజకీయం తెలిస్తేనే బతుకులు బాగుపడతాయంటూ ప్రస్తుత తరానికి సైతం ఓ మంచి సందేశాన్ని ఇచ్చారు. ఇదిలా ఉంటే కింది కులాల వారికి గుడిలోకి ప్రవేశానికి వందేళ్లు పట్టిందనే సత్యాన్ని చెప్పారు. కులాల కుంపటిలో తల్లి లాంటి బిడ్డను కోల్పోయిన తండ్రి.. ఆవేదన. తండ్రి ఆవేశం వల్ల చెల్లిని కోల్పోయాననే ఆవేశంతో కన్న కొడుకు తండ్రిని అసహ్యించుకునే సందర్భం… ఆవేశం, ఆవేదనలకు అంతులేని దుఃఖానికి దండోరా సాక్ష్యంగా కన్పించింది. చివరగా ఏ ఆధిపత్య కులం అని గర్వంగా విర్రవీగాడో.. ఆ కులమే ఆయన అంత్యక్రియలనే ఆఖరి మర్యాదకు అడ్డుపడింది. భూమిని సంఘానికి రాసి ఇస్తేనే అంత్యక్రియలకు శ్మశాన వాటికలో అవకాశం ఇస్తామనే షరతు కుల రాక్షసత్వం ఎంత ప్రమాదమో తెలిసివచ్చేలా చేసింది. ఆ భూమి ఏదో కులానికి కాదు.. అది చచ్చిన మనిషికి ఇచ్చే అఖరి మర్యాద కోసం అని పెంచుకున్న బిడ్డ ఊరి ప్రజల కోసం ఇచ్చి కుల రాక్షసత్వంపై.. కులం పెనుభూతాన్ని తరిమికొట్టినంత పనిచేసి కుల కట్టుబాట్లను ఎదురించగలిగింది.. కులం బలం అవ్వాలి.. కానీ భయం కాకూడదు. అనే గొప్ప సందేశాన్ని దర్శకుడు ఇవ్వడం నిజంగా గొప్ప విషయం. దండోరా నిజంగా కుల రాక్షసత్వాన్ని చూపింది. ప్రేమ, చావు, అంత్యక్రియలు అనే మూడు అంశాలను పట్టుకొని ఆనాటి పరిస్థితులను కళ్లకు అద్దారు. అంతటి గొప్ప సినిమా దండోరా.. అందుకే జూనియర్ ఎన్‌టిఆర్ సైతం ‘దండోరా సినిమాపై ట్వీట్ చేసి మెచ్చుకున్నారు. నిజంగా అది ఆయన మంచి మనసుకు సాక్ష్యం. యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకొని తీసిన సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా.. మిగతా ఇండస్ట్రీలోని పెద్ద వారు మాట్లాడకపోయినా ‘దండోరా’ నుంచి నేటి తరం నేర్చుకుంటుంది. సమాజమనే కుటుంబం పట్ల బాధ్యతగా మెదిలేలా దర్శకుడు మురళీకాంత్ గొప్ప ప్రయత్నం.. రేపటి రోజుల్లో కులహత్యలు, పరువు హత్యలు తగ్గడానికి కారణం అయ్యేలా సినిమాను ఆవిష్కరించారు.. ఇటువంటి సామాజిక, సందేశాత్మక చిత్రాలు మరెన్నో రావాల్సిన అవసరం ఉంది.

సంపత్ గడ్డం

78933 03516