
నాకు రక్తాన్ని ఇవ్వండి స్వేచ్ఛను మీకు ఇస్తానన్న సుభాష్ చంద్ర బోస్ గొప్ప యోధులు. స్వేచ్చ ఎవరికీ ఇవ్వబడదు మనకు మనమే తీసుకోవాలి. మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి అన్యాయంతో రాజీపడడం అంటే అతి పెద్ద నేరం చేసినట్టే. ఇవన్నీ నేతాజీ చెప్పిన మాటలు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్య్ర సమరయోధుడు. ‘ఢిల్లీ చలో’, ‘జై హింద్’, ‘నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను’ అనేవి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రసిద్ధ నినాదం. సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టినవాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది. బోసుకి రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ అహింసావాదం మాత్రమే స్వాతంత్య్ర సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఆల్ ఇండియా యూత్ లీగ్) అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. ఈయనను ఆంగ్లేయులు దాదాపు 11 సార్లు కారాగారంలో నిర్బంధించారు.
939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి బోసు దీన్ని ఒక సువర్ణవకాశంగా భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరుతోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్యసహకారాలతో సింగపూర్‌లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పరచాడు. బోసు మరణం వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18లో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరణించాడని ప్రకటించినప్పటికీ, అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతంలోకి వెళ్ళాడని అధిక సంఖ్యాకుల అభిప్రాయం.
సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న భారతదేశంలోని ఒడిషాలోని కటక్ పట్టణంలో జన్మించాడు. తండ్రి జానకినాథ్ బోస్ గొప్ప లాయరు. గొప్ప జాతీయవాది. బెంగాల్ శాసనమండలికి కూడా ఎన్నికయ్యాడు. తల్లి పేరు ప్రభాబతి బోస్. బోస్ విద్యాభ్యాసం కటక్లోని రావెన్షా కాలేజీయేట్ స్కూలులోను, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజీలోను, ఫిట్జ్ విలియమ్ కాలేజీలోను సాగింది. 1920లో బోస్ భారతీయ సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరై అందులో నాలుగవ స్థానంలో నిలిచాడు. ఇంగ్లీషులో అత్యధిక మార్కులు సాధించాడు. అయినా 1921 ఏప్రిల్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసు నుండి వైదొలగి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొననారంభించాడు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించసాగాడు. సహాయ నిరాకరణోద్యమం సమయంలో మహాత్మా గాంధీ బోస్‌ను కలకత్తా పంపాడు. అక్కడ చిత్తరంజన్ దాస్‌తో కలసి బోస్ బెంగాల్‌లో ఉద్యమం నిర్వహించాడు.
ఐరోపాలో ఉన్న సమయంలో బోస్ ఆలోచనలలో కొత్త భావాలు చోటుచేసుకొన్నాయి. స్వతంత్ర దేశంగా అవతరించడానికీ, మనడానికీ భారత దేశానికి ఇతర దేశాల సహకారం, దౌత్య సమర్థన, ప్రత్యేక సైన్యం ఉండాలని గ్రహించాడు. 1937 డిసెంబరు 26న బోస్ ఎమిలీ షెంకెల్ అనే తన కార్యదర్శిని వివాహం చేసుకొన్నాడు. ఈమె ఆస్ట్రియాలో జన్మించింది. వారికి 1942 లో పుట్టిన కూతురు పేరు అనిత. బోస్ తన భార్యకు రాసిన అనేక ఉత్తరాలను తరువాత లెటర్స్ అనే సంకలన పుస్తకంగా శిశిర్ కుమార్ బోస్, సుగాతా బోస్ ప్రచురించారు.
బోస్ 1939 లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి 1938లో, గాంధీ అభిరుచికి వ్యతిరేకంగా, బోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. బోస్ ప్రత్యర్థి అయిన పట్టాభి సీతారామయ్య పరాజయం తన పరాజయంగా గాంధీ భావించాడు. ఇలా పార్టీలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం వల్ల బోస్ కాంగ్రెస్ నుండి వైదొలిగాడు. వేరు మార్గం లేని బోస్ ‘అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్’ పార్టీని స్థాపించాడు. 1938లో ‘జాతీయ ప్రణాళికా కమిటీ’ అనే సంస్థాగత వ్యవస్థకు నాంది పలికాడు.
స్వాతంత్య్రానికి బోస్ ప్రణాళిక జర్మనీలో భారత జాతీయ సైన్యం అదృశ్యం, అనుమానాస్పద మరణమును రెంకోజీ ఆలయం (జపాన్) అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగస్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు. కానీ ఆయన శవం మాత్రం దొరకలేదు. దీని వల్ల ఆయన బతికి ఉండవచ్చునని ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి బోస్ సోవియట్ యూనియన్‌కు బందీగా ఉండగా సైబీరియాలో మరణించాడని. దీనిని విచారించడానికి భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసింది. 1956 మే నెలలో నలుగురు సభ్యులతో కూడిన షానవాజ్ కమిటీ బోస్ మరణాన్ని గురించి విచారించడానికి జపాన్‌కు వెళ్ళింది. అప్పట్లో భారత్‌కు తైవాన్‌తో మంచి సంబంధాలు లేకపోవడంతో వారి సహకారం కొరవడింది. దాంతో ఇది ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు.
కానీ 1999- 2005 లో విచారణ చేపట్టిన ముఖర్జీ కమిషన్ తైవాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి బోసు ప్రయాణిస్తున్న ఏ విమానమూ అక్కడ కూలిపోలేదని నిర్ధారణకు వచ్చింది. అంతేకాకుండా అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సమర్థిస్తూ ఈ కమిషన్‌కు లేఖను పంపడం జరిగింది. ఈ కమిషన్ తన నివేదికను నవంబర్ 8, 2005 ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని ప్రభుత్వం మే 17, 2006లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదనీ, రెంకోజీ గుడిలో ఉన్నది ఆయన చితాభస్మం కాదని తేలింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికను తిరస్కరించింది. చరిత్ర ఉన్నంత కాలం బోస్ భారత ప్రజల గుండెల్లో ఉంటారు. నేటి యువతరం నేతాజీని స్ఫూర్తిగా తీసుకోవాలి. వారి చరిత్రను అధ్యయనం చేయాలి.
కామిడి సతీష్ రెడ్డి
9848445134