
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు పాటించిన మిల్లర్లకు సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని, తప్పిదాలకు పాల్పడితే మాత్రం చర్యలు కఠినాత్మకంగా ఉంటాయని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రాజకీయ వత్తిళ్లకు లొంగకుండా నిబంధనల అమలులో సిబ్బంది కఠినం గా ఉండాలని ఆయన ఉద్బోధించారు. అదే సమయంలో డిఫాల్ట్ అయిన మిల్లులకు ధాన్యం కేటాయింపు ప్రసక్తే లేదని ,పౌర సరఫరాల శాఖ రూపొందించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనున్నారు. పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తి కనుగుణంగా ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రంలో మిల్లుల పరిశ్రమను ప్రోత్సహించేలా విధివిధానాలను త్వరలో ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రం ధాన్యం దిగుబడిలోనే కాకుండా ఖరీఫ్ సీజన్ లో కొనుగోలు చెందిన ధాన్యం దేశచరిత్రలోనే ఆల్ టైం రికార్డ్ నమోదు చేసుకుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గడిచిన 25 సంవత్సరాల వ్యవధిలో ఇదే అత్యధిక రికార్డ్ అని ఆయన చెప్పారు. 2025- 26 రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కోసం పౌర సరఫరాల శాఖా రూపొందించిన ప్రణాళికలపై గురువారం బేగంపేట ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ భవనంలో జరిగిన సమీక్ష సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల వ్యవధిలో అనుసరించిన విధానాల ఫలితమే ధాన్యం దిగుబడి, కొనుగోలులోనూ సంచలనాత్మక రికార్డ్ నమోదు చేసుకుందని చెప్పారు. పౌరసరఫరాల శాఖా,నీటిపారుదల, వ్యవసాయ శాఖలు పరస్పరం సమన్వయం చేసుకోవడంతో పాటు తెలంగాణా రైతాంగం భాగస్వామ్యంతోనే ఇంతటి విజయం సాధించామని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల చరిత్రలోనే రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన ఘనత తెలంగాణా రాష్ట్రానికి దక్కిందన్నారు. 70.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు : దేశ చరిత్రలోనే ఇంత పెద్ద స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో లేవని అన్నారు. 2020- 21 లో నమోదు అయిన 70.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు రికార్డును అధిగమించి తాజాగా జరిగిన ఖరీఫ్ సీజన్ లో71.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి దేశ చరిత్రలోనే కొత్త అధ్యాయం సృష్టించిందన్నారు. మద్దతు ధరతో పాటు సన్నాలకు మొట్టమొదటి సారిగా తెలంగాణా ప్రభుత్వం అందిస్తున్న బోనస్ తో కలిపి మొత్తం 18,532.98 కోట్ల రూపాయలను 14.20 లక్షల మంది రైతులకు చెల్లించామన్నారు.