
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేకనే రేవంత్ నోటీసుల డ్రామా అంటూ ఘాటు విమర్శలు చేశారు. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ వరుస స్కాంల నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్ నోటీసులు అంటూ ఆరోపణలు చేశారు. రేవంత్‌రెడ్డి బామ్మర్ది బొగ్గు స్కాం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ‘రాజకీయకక్ష సాధింపు చర్యలో భాగమే నిన్న నాకు, నేడు కెటిఆర్‌కు ఇచ్చిన నోటీసులు’ అని పేర్కొన్నారు. ప్రతీకారం అనేది బలహీనుల ఆయుధం..దమ్మున్న నాయకుడి ఆయుధం ఎప్పుడూ ప్రజాపోరాటమే అని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి బలహీనులు కాబట్టే పోలీసులను ఆయుధాలుగా వాడుకుంటున్నారని,
తాము ధైర్యవంతులం కాబట్టే ప్రజల మధ్య నిటారుగా నిలబడి సిఎంను నిలదీస్తున్నామని అన్నారు. సిట్ నోటీసులకు సమాధానం చెప్పడానికి బిఆర్‌ఎస్ నాయకులం ఎప్పుడూ సిద్ధమే అని తేల్చిచెప్పారు. కానీ, రేపు ప్రజా కోర్టులో సమాధానాలు చెప్పడానికి రేవంత్‌రెడ్డి సిద్దంగా ఉండాలంటూ సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డి ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎంత మంది బిఆర్‌ఎస్ నాయకులను విచారణ పేరుతో వేధించే ప్రయత్నం చేసినా.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా ఆయనను, ఆయన పార్టీని వదిలిపెట్టం అని హెచ్చరించారు. అంతే కాదు, కాంగ్రెస్ సర్కార్ కుంభకోణాలను, వాటాల పంచాయతీలను బట్టబయలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా బిఆర్‌ఎస్ నాయకులు సింహాల్లా గర్జిస్తూనే ఉంటారు..జై తెలంగాణ..జై కెసిఆర్ అంటూ ట్వీట్ చేశారు.