
జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్బూమ్ జిల్లాలో గురువారం భారీ స్థాయి ఎన్‌కౌంటర్ జరిగింది. సిఆర్‌పిఎఫ్‌కు చెందిన కోబ్రా దళం దాడిలో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. తలపై రూ కోటి పారితోషికం ప్రకటితం అయి ఉన్న అగ్రస్థాయి నక్సల్ పత్రీరామ్ మాజీ అలియాస్ అనల్‌దా కూడా మృతుల్లో ఉన్నాడు. దాదాపు 1500 మందితో కూడిన సుశిక్షిత కోబ్రా దళం నక్సలైట్ల గాలింపు చర్యలలో వెళ్లుతుండగా సరందా అటవీ ప్రాంతంలోని కుమ్దీ వద్ద ఎదురు కాల్పుల ఘటన జరిగిందని , ఇది కిరిబురా పోలీసు స్టేషన్ పరిధిలో ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. నక్సల్స్ పూర్తి స్థాయి నిర్మూలన లక్షంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో పెద్ద ఎత్తున నక్సల్స్ గాలింపు చర్యలు వేగవంతం అయ్యాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ భారీ స్థాయి కోబ్రా చర్య జరిగింది. భారీ పటాలంతో కోబ్రా బలగాలు ఈ ప్రాంతంలో మంగళవారం నుంచే తమ ఆపరేషన్ ఆరంభించాయి. అయితే గురువారం అడవుల్లో పొంచి ఉన్న నక్సలైట్ల వైపు నుంచి ముందుగా కాల్పులు ఎదురయ్యాయని, తమ వైపు నుంచి ప్రతి చర్య జరిగిందని అధికారులు తెలిపారు.
ఈ తరువాత ఇక్కడ జరిపిన గాలింపులో 15 మంది మావోయిస్టుల భౌతిక కాయాలను గుర్తించామని వెల్లడించారు. వీరిలో ఒకరిని మావోయిస్టు కీలక నేత అనల్ దా అని గుర్తించామని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ఆపరేషన్స్) మైకెల్ రాజ్ ఎస్ వార్తా సంస్థలకు తెలిపారు. ఈ ప్రాంతంలో నక్సల్స్ సంచారం ఎక్కువగా ఉందని సమాచారం అందింది. వీరిలో నక్సల్స్ అగ్రనేత కూడా ఉన్నారని నిర్థారణ అయిందని, దీనితో తాము గాలింపులు ఉధృతం చేశామని వివరించారు. గిరిధ్ జిల్లాలోని పిర్తాంద్‌కు చెందిన పత్రీరామ్ మావోయిస్టు దళంలో 1987 నుంచి చురుకుగా పనిచేస్తున్నాడు. ఆయనపై కోటి రూపాయిల రివార్డు ప్రకటించారు. ఆయన కోసం చాలా సంవత్సరాలుగా గాలిస్తున్నారు. భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలియగానే ఈ ప్రాంతంలో సిఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తమ బృందంతో ఛాయ్‌బసా ప్రాంతంలో పర్యటించారు. కోబ్రా అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో గాలింపు చేపట్టారు.
నక్సలైట్లు మరింత ఎక్కువ సంఖ్యలోనే చనిపోయి ఉంటారని , ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశామని అధికారులు తెలిపారు. జార్ఖండ్‌లో చాలా వరకూ నక్సల్స్ నిర్మూలన జరుగుతోంది. కొల్హాన్, సరందాలు వీరికి మిగిలిన చివరి స్థావరాలు అని వెల్లడైంది. జార్ఖండ్‌లోని బుడా పహాడ్, ఛత్రా , లాటేహర్ , గుమ్లా, రాంచీ , పరాసంత్ ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే మావోయిస్టుల ఏరివేత దాదాపు పూర్తి అయింది. ఇప్పుడు మిగిలిన కంచుకోట వంటి ఈ ప్రాంతంపై కూడా కోబ్రా దళాలు విరుచుకుపడ్డాయి.ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్ జరిగింది.