
గ్రవాదుల ఏరివేతకు వెళ్లుతున్న సైనిక బృందం ఘోర ప్రమాదానికి గురైంది. విధి నిర్వహణలో ఉన్న పది మంది సైనికులు చనిపోయారు. 11 మంది గాయపడ్డారు. అత్యంత విషాదకరమైన ఈ ఘటన గురువారం మధ్యాహ్నం జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లా పర్వత ప్రాంతాలలో జరిగింది. సైనిక అధికారులు వివరాలు వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల గాలింపు కోసం సైనిక బృందం కాస్పెర్ సాయుధ శకటంలో వెళ్లుతుండగా, అదుపు తప్పింది. రాహదారి పక్కనే ఉన్న 200 అడుగుల లోతున్న లోయలోకి దూసుకువెళ్లింది. దాదాపు 9000 అడుగుల ఎతైన అత్యంత క్లిష్టమైన పర్వత శ్రేణుల మధ్య ఖన్ని శిఖరంపై వెళ్లుతుండగా ప్రమాదం జరిగింది. ఇక్కడి బదేర్‌వా ఛాంబా అంతరాష్ట్ర రాదారిలో ఈ బుల్లెట్‌ప్రూఫ్ వాహనం ప్రమాదానికి గురయింది. కాస్పెర్ శకటం అత్యంత సురక్షిత ఎంఆర్‌ఎపి వాహనం. మందుపాతరల పేల్లుళ్లు, దాడులను తట్టుకుని నిలబడగలిగే దుర్భేధ్యపు అమరికతో రూపొందింది. వాతావరణ ప్రతికూలతలను తట్టుకుంటూ , ఎటువంటి ఐఇడి పేలుళ్లకు అయినా దుర్భేధ్యంగా నిలుస్తుంది. వాతావరణ ప్రతికూలతతో అత్యంత ఇరుకైన కొండచరియల
మధ్య సరైన నేవిగేషన్ వీలుకాకపోవడంతో ఈ శకటం రోడ్డు నుంచి జారిపోయి లోయలో పడిందని జమ్మూ కేంద్రంగా ఉన్న వైట్‌నైట్ కార్ప్ విభాగం తమ ప్రకటనలో తెలిపింది. ఇది అత్యంత దురదృష్టకర ఘటన అని, తోటి జవాన్లు విషాదాంతం చెందడం బాధాకరం అని సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలియగానే ఘటనా స్థలికి సైనికులు, పోలీసుల సంయుక్త దళాలు తరలివచ్చాయి. లోయలో చెల్లాచెదరుగా పడి ఉన్న మృతదేహాలను గుర్తించి వెలికితీసే పని చేపట్టాయి. ముందుగా గాయపడ్డ వారిని చికిత్సకు ఆసుపత్రికి తరలించారు. వాహనం పూర్తిగా ధ్వంసం అయి ఉండగా వెలికితీశారు. మొత్తం పది మంది జవాన్ల మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటన తమకు అత్యంత బాధాకరం అని ఇక్కడి పోలీసు అదనపు సహాయ కమిషనర్ సుమిత్ కుమార్ భూట్యాల్ తెలిపారు. ఈ విషాద ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్ ఇతరులు సంతాపం వ్యక్తం చేశారు. ఆర్మీకి చెందిన నార్తర్న్ కమాండర్ తరఫున ఈ జవాన్ల మృతి పట్ల సంతాప సందేశం వెలువడింది. జనరల్ ఆఫీసరు కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.