
రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్,కేంద్రంలో ఉన్న బిజెపి ఒక్కటే అని, అందుకే సింగరేణి టెండర్ల వ్యవహారంలో విచారణ చేపట్టడం లేదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. సింగరేణి టెండర్లలో జరిగిన అవినీతిలో ముఖ్యమంత్రి బామ్మర్ది కీలకం అని తెలుస్తుందని, ఈ వ్యవహారంలో సిఎం విచారణకు కోరుతారా..? అని ప్రశ్నించారు.కాంగ్రెస్, బిజెపి కబంధ హస్తాల నుండి సింగరేణిని కాపాడడం కోసం పోరాటం చేస్తామని వెల్లడించారు. సింగరేణి సంస్థ కాంగ్రెస్ పార్టీది కాదు….బిజెపిది కాదు అని, ఆ సంస్థ తెలంగాణ ప్రజల హక్కు అని పేర్కొన్నారు. సింగరేణి సంస్థను దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సింగరేణి బచావో పేరు మీద ఉద్యమం చేస్తామని చెప్పారు. నైని బ్లాక్ ఒక్కటే కాదు…మొత్తం టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో జరుగుతున్న బొగ్గు బ్లాకుల కుంభకోణంపై రాష్ట్రంలో చర్చ జరుగుతోందని అన్నారు. ఈ కుంభకోణంపై తమ నేత హరీష్ రావు ఆధారాలతో బయట పెట్టడంతో నైని టెండర్లు రద్దు చేశారని పేర్కొన్నారు. మిగతా బ్లాకుల టెండర్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.
సింగరేణి అంటే ఒక్క బొగ్గు బ్లాక్ కాదు అని, అనేక మంది కుటుంబ సభ్యుల భవిష్యత్తు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని విమర్శించారు. స్వయాన ముఖ్యమంత్రి బావమర్ది ప్రసన్నం చేసుకోవడం కోసమే ఈ కుంభకోణం అని తెలుస్తోందని పేర్కొన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి గురించి ఆలోచించారని అన్నారు. ఈ బొగ్గు కుంభకోణం బయట పెడితే హరీష్ రావును సిట్ విచారణ పేరిట ఇబ్బంది పెట్టారని మండిడ్డారు. సింగరేణి టెండర్ల విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సైట్ విసిట్ సర్టిఫికేషన్ అనేది ముఖ్యమంత్రి బామ్మర్ది మేలు కొరకే పెట్టారని ఆరోపించారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మైనస్‌లలో టెండర్లు జరిగేవి అని, ఇప్పుడు ప్లస్‌లలో టెండర్ల ప్రక్రియ జరుగుతుంది అంటే కుంభకోణం జరిగినట్లే కదా..? అని అడిగారు. మంత్రుల మధ్య వాటాల పంపిణీ తేడాతోనే ఈ కుంభకోణం బయటకు వచ్చిందని కిషన్ రెడ్డి అన్నారని, మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.