Reading Time: 2 minutes

దావోస్ వేదిక నుంచే కీలక నిర్ణయాలు

అమెరికా కదలికలపై దీవి ప్రజల ఆగ్రహం

తమకు సంబంధం లేని విషయం అన్న పుతిన్

దావోస్ : మిత్రపక్ష ఐరోపాదేశాలపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తమ గ్రీన్‌లాండ్ టారీఫ్‌ను వెనుకకు తీసుకున్నారు. ఎనిమిది యూరప్ దేశాలపై తమ ప్రతిపాదిత పాతిక శాతం తొలిదఫా సుంకాలను నిలిపివేస్తున్నానని దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు నేపథ్యంలో ట్రంప్ గురువారం ప్రకటించారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా తీసుకుంటుందనే తమ ప్రతిపాదనపై వ్యతిరేకత చూపే మిత్రదేశాలు తమకు శత్రుదేశాల కన్నా ఇబ్బందికరం అని ట్రంప్ భావించారు. అత్యంత కీలకమైన దేశాలపై ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా గ్రీన్‌లాండ్ టారీఫ్‌ను గత వారం ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయా దేశాలు అర్కిటిక్ దీవికి సంబంధించి దారికి వచ్చాయని ట్రంప్ చెప్పారు.

అర్కిటిక్ డీల్ నమూనాపై నాటో దేశాలు అంగీకారానికి వచ్చినట్లు తెలిసిందని, అందుకే టారీఫ్‌లను నిలిపివేసినట్లు ట్రంప్ తెలిపారు. గ్రీన్‌లాండ్ తమకు కావల్సిందేనని, దీనిపై హక్కులను , భౌగోళిక అధికారాన్ని, చివరికి యాజమాన్యాన్ని పొంది తీరుతామని ట్రంప్ దావోస్ వేదికగానే ప్రకటించారు. ఐరోపా దేశాల వైఖరిపై మండిపడ్డారు. అయితే ఇప్పుడు గ్రీన్‌లాండ్ భద్రతకు తమ ఫార్మూలాకు నాటో అధినేత అంగీకరించారని, దీనితో తాము గ్రీన్‌లాండ్ టారీప్‌ను నిలిపివేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. వారు దారిలోకి రావడం మంచి పరిణామం అయిందన్నారు. అమెరికాకు అత్యంత కీలకమైన రక్షణ వలయం గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ, పైగా 175 బిలియన్ డాలర్ల వ్యయంతో కూడిన తమ ప్లాన్ గురించి కూడా తాను నాటోతో చర్చించినట్లు ట్రంప్ ప్రకటించారు.

ఈ బహుళ స్థాయి వ్యవస్థతో అమెరికా తొలిసారిగా తమ ఖండాంతర క్షిపణులను ఇతర కీలక ఆయుధాలను ఏకంగా అంతరిక్షంలో అమర్చి ఉంచడానికి వీలేర్పడుతుంది. వీటిని అవసరం అయినప్పుడు వాడుతారు. ఐరోపా దేశాలతో జరిపిన చర్చలలో తాను ఆశించిన దాని కంటే ఎక్కువ ఫలితాలు వెలువడ్డాయని, తాము సరికొత్త టారీఫ్ నిర్ణయాన్ని వెనకకు తీసుకుంటున్నానని ట్రంప్ తమ సోషల్ మీడియా ప్రకటనలో తెలిపారు. గ్రీన్‌లాండ్‌పై ఆధిపత్యాన్ని తాము ఈ ప్రాంత రక్షణకే కాకుండా, అమెరికా ప్రయోజనాల కోణంలోనే చూడకుండా , మొత్తం ప్రపంచ శాంతి పరిరక్షణ దృక్ఫథంతోనే చూస్తున్నామని దావోస్ వేదికగా ట్రంప్ ఘాటైన కీలక ప్రసంగం చేయడంతో ప్రపంచ దేశాల నేతలలో తీవ్ర ప్రకంపనలు చెలరేగాయి.