
తెలంగాణలో కొన్ని జిల్లాలను రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. గురువారం సాయంత్రం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల సౌలభ్యం కోసం కెసిఆర్ రాష్ట్రంలో కొన్ని జిల్లాలు ఏర్పాటు చేశారు. కానీ, అవి అశాశిస్త్రీయంగా ఏర్పాటు చేశారంటూ.. రిటైర్డ్ జడ్జిలతో ఏదో కమిషన్ వేస్తున్నారని అన్నారు. కెసిఆర్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను రద్దు చేయడమే దీని ఎజెండా అని అనుమానం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలను కూడా రద్దు చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. జిల్లాలను రద్దు చేస్తే.. ప్రజల చేతిలో కాంగ్రెస్ కు చావు దెబ్బ తప్పదన్నారు.
పంచాయతీ ఎన్నికల తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తారని అనుకున్నామని.. కానీ, పరాజయం తప్పదన్న భయంతో ప్రభుత్వం జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహించడం లేదని కెటిఆర్ విమర్శించారు. జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు.
కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కెటిఆర్ కు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు. దీంతో మరికాసేపట్లో హరీష్ రావుతోపాటు కెటిఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లి కెసిఆర్ ను కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సిట్ నోటీసులపై చర్చించే అవకాశం ఉంది.