
అమరావతి: భూమండలం మీద ఇంత దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలవారు ఎవరూ ఉండరని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఎపి సిఎం చంద్రబాబునాయుడును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..భూ రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన కూడా గతంలో నీకు ఎప్పుడైనా వచ్చిందా? అని రైతుల సమస్యలు తీర్చాలన్న కనీస ఆలోచన వచ్చిందా? అని ప్రశ్నించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారమే రీ సర్వే అని తెలియజేశారు. 2019 కంటే ముందు భూములు సర్వే చేసే టెక్నాలజీ లేదని, భూములు రీ సర్వే చేయించాలని తన పాదయాత్రలో నిర్ణయించామని అన్నారు. తాము అధికారంలోకి వస్తే సమగ్ర భూ సర్వే చేయిస్తానని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామని జగన్ పేర్కొన్నారు. ట్యాంపరింగ్ చేయలేని విధంగా భూ యజమానులకు, రైతులకు శాశ్వత పత్రాలు ఇచ్చామని, భూ సర్వేను మహాయజ్ఞాం లా చేపట్టామని అన్నారు. వందేళ్ల క్రితం బ్రిటిషర్ల కాలంలో భూ సర్వే చేశారని, 2020 డిసెంబర్ 21న భూముల రీ సర్వే ప్రారంభించామని, నాలుగు సార్లు సిఎంగా చేసిన చంద్రబాబు ఏనాడైనా ఇలా చేశారా? అని జగన్ ప్రశ్నించారు.
క్రయవిక్రయాలు జరిగినా సమస్యలు లేకుండా.. అన్నదమ్ముల మధ్య పంపకాలు జరిగినా ఇబ్బందులు లేకుండా చేశామని అన్నారు. రైతులకు, ప్రజలకు వివాదాలు లేని విధంగా పారదర్శకంగా భూములు సర్వే చేశామని, ఏకంగా 15 వేల గ్రామ సచివాలయాలు ఒక రికార్డు అని కొనియాడారు. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగుల నియామకం కూడా రికార్డేనని, ఒక్క నోటీఫికేషన్ తోనే లక్షా 34 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబుకు సిగ్గుండాలని విమర్శించారు. యూరప్, అమెరికాలో వాడే టెక్నాలజీతో భూముల రీ సర్వే చేశామని, గ్రామ సచివాలయాల్లోనే భూ రిజిస్ట్రేషన్ చేశామని అన్నారు. 80 ఏళ్ల వయసున్న చంద్రబాబు ఎప్పుడైనా ఇలా చేశారా? అని నిలదీశారు. తాము చేసిన భూ సర్వేను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. సర్వేలో హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగించామని, టెక్నాలజీపై అవగాహన కోసం 40 వేల మందికి శిక్షణ ఇచ్చామని అన్నారు. కోట్ల సంఖ్యలో సర్వే రాళ్లను గ్రామాలకు తరలించామని, 2020డిసెంబర్ 9న సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నామని జగన్ స్పష్టం చేశారు.