
మనిషి పని చేస్తూ, చేస్తూ ఎక్కడో ఓ చోట ఆగిపోయి విశ్రాంత జీవన మజిలీకి సిద్ధపడవలసిందే. వయసుతో సంబంధం లేకుండా కూడా చాలా మంది తమ విధులు కొనసాగిస్తుంటారు. కాలు, చేయి సహకరించినంతకాలం అది సాధ్యపడుతుంది. ఉద్యోగికి మాత్రం కొన్ని నిబంధనలుంటాయి. అవి చట్టం ద్వారా ఏర్పరచినవి. వాటికి ఎవరు అతీతులు కాదు. పదవీ విరమణ వయసు వచ్చిందంటే సీటు ఖాళీ చేయాల్సిందే. ఒక్కసారిగా ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక జీవితంలో ఒక కొత్త వెలితి ఏర్పడుతుంది. దినచర్య అంతా అపసవ్యంగా అనిపిస్తుంది. సమయానికి డ్యూటీకి వెళ్ళమని బెత్తంలా బెదిరించే గడియారం ముల్లు ఇప్పుడు పట్టించుకోదు. పొద్దుటే రెడీ అయి ఎటుపోవాలో తెలియదు. పోయేందుకు పని కూడా ఉండదు. సర్వీసులో ఉన్న మిత్రులను ఊసుపోనీ ముచ్చట్ల కోసం డిస్టర్బ్ చేయడానికి సభ్యత అడ్డొస్తుంది. అలా మనసు చిందరవందరై.. ఎటూ పాలుపోక కాలు, చేయి కదిలించే దానికైనా అలా తెలిసిన వీధుల్లోకి వెళ్లక తప్పదు. ఎదురైనా పరిచయస్తులతో నాలుగు మాటలు కలిపి మళ్ళీ ఇల్లు దారిపడితే అప్పుడేనా గూటికి చేరేది.. వెళ్లి చేసేదేముంది అనిపిస్తుంది. తెలియకుండానే కాళ్లు లాగే దాకా ఇంటి ముందే నిలబడిపోతారు.
విశ్రాంత ఉద్యోగి అని బ్రాండ్ పడిన వారందరు ఒకే వయసువారై ఉండరు. అరవై నుండి ఎనభై పైకే లెక్కలోకి తీసుకోవచ్చు. అందరూ ఒకే నావలో పయనిస్తున్నా అనుభవాలు, ఆరాటాలు తీరొక్క మాదిరిగా ఉంటాయి. అలా విశ్రాంత జీవుల ప్రపంచమే వేరు. నవ రిటైరీలకు వృద్ధాప్యపు ఛాయలతో రాబోయే అనారోగ్య ప్రకంపనలకు ముందస్తు సమాచార దాతలు సీనియర్లే. పిఎఫ్ సొమ్మును, మిగులు పెన్షన్‌ను ఎలా కాపాడుకోవాలో అనుభవపూర్వకంగా వారే చెప్పగలరు. డబ్బును పోగొట్టుకున్న, కాపాడుకున్న తీరుతెన్నులు తెలుస్తాయి. అందుకోసమైనా ఒంటరి విశ్రాంత జీవులు ఒకరికొకరు కలవాలి. అలా కలుసుకోవాలంటే వారికంటూ ఒక గూడు, నీడ కావాలి. ఈ లోటు తీర్చేందుకే అన్నట్లుగా ఇప్పుడు చాలా పట్టణాల్లో పెన్షనర్ల సంఘాలు కొలువైతున్నాయి. పట్టణ స్థాయిలో రిటైర్ అయినవారు వందలలో ఉంటారు. పావు గంట నడక దూరంలో లేదా పది నిమిషాల టూ వీలర్ ప్రయాణమైనా సంఘం ఆఫీసులో తోటివాళ్లను కలవచ్చు. భావాలు, ఆలోచనలు, అభిరుచులు కుదిరే మనుషుల తోడు అక్కడ దొరికితే కాలం పూలతేరుపై కదిలిపోతుంది. ఒంటరితనపు జైలులోంచి బయటికి రావడంతో మానసిక, శారీరక ప్రశాంతత దరిచేరి జీవితానికి నూతన జవసత్వం అందుతుంది. బాల్యం మాదిరే మళ్ళీ కొత్తగా ప్రాణమిత్రుల సాంగత్యం దొరుకుతుంది.
కొత్త రిటైరీల చేర్పు ఆనందాన్ని ఇస్తే, పాత వారి జీవితాల ముగింపు దుఃఖాన్ని పంచి కొత్త తత్వాన్ని అలవరుస్తుంది. కలెక్టర్ స్థాయి కేటాయింపుతో ప్రభుత్వ స్థలం కొంత లభిస్తే.. నేతల, దాతల చేయూతతో పెన్షనర్స్ భవన్ నిలబడుతుంది. ఒకరు టేబుల్, కుర్చీలు సమకూర్చితే, ఇంకొకరు లైట్లు, ఫ్యాన్లు అందిస్తారు. పెద్దల జ్ఞాపకార్థంగా దాతృత్వానికి సిద్ధపడేవారు ఊరికి కొందరైనా ఉంటారు. తలా ఒక చెయ్యేస్తే ఊరూరా ఒక సౌకర్యవంతమైన పెన్షనర్ల రచ్చబండ ఏర్పాటు కావడం కష్టమేమి కాదు. ఒక్కసారి నిలబడిందంటే రాలే ఆకులు రాలుతున్నా కొత్త చిగుర్లు పుట్టుకొచ్చే చెట్టులా నిరంతరం కొనసాగుతుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నిర్వహణలో సాగే పెన్షనర్స్ భవన్ ఇలాంటి చాలా విషయాల్లో ఆదర్శంగా నిలుస్తుంది. విశాలమైన రెండంతస్తుల భవనం అన్ని రకాల సమ్మేళనాలకు అనుకూలంగా ఉంది. రోజుకొక్కసారైనా అటువైపు వెళ్లకపోతే ఏదో కోల్పోయినట్లు భావించే వారెందరో ఉంటారు. తీరిగ్గా ఇంట్లోంచి బయటపడితే కాళ్లు భవన్ వైపే వారిని తీసుకెళ్తాయి. దినపత్రికలు తిరగేస్తూ ప్రధాన వార్తల చర్చలో కొందరుంటే, మరోవైపు ఊర్లోని సంగతుల ప్రస్తావనతో కొందరు బిజీగా కనబడతారు.
చెస్, క్యారమ్స్ ఆటగాళ్లకు సమయమే తెలియదు. సాయంత్రం వేళ పొద్దు వాలుతున్న రీతిలో సొంత అవసరాలు, బంధు మిత్ర ముచ్చట్లతో కాలం వెళ్ళిపోతుంది. కాళ్లకు మెత్తని చెప్పులు నుంచి ఒడుపుగా ఉండే చేతి కర్ర దాకా ఏది బాగుంటుంది, అది ఎక్కడ.. ఏ ధరకు దొరుకుతుంది అనే వివరాలు చర్చకొస్తాయి. ఆరోగ్య సమస్య తలెత్తితే దాని పూర్వాపరాలేమిటి, ఊర్లో ఏ డాక్టర్ బాగు చేస్తాడు అనే ఉచిత సలహాలు ఇచ్చిపుచ్చుకుంటారు. సొంత ఊసుల నడమ పౌర బాధ్యత మరిచిపోరు. జాతీయ పండుగలు, గొప్పవారి సంస్మరణ సభలు ఘనంగా జరుపుతారు. ప్రముఖులను ఆహ్వానించి సముచితంగా గౌరవించి తమ ఉనికిని చాటిచెపుతారు. క్రమంగా సత్తువ తగ్గి, ఆరోగ్యం సహకరించక ఆఫీసు దాకా రాలేనివారితో బంధాలు తెగిపోవు. బర్త్ డే లాంటి విశేష సందర్భాల్లో వారి ఇంటి దాకా వెళ్లి వేడుకలో భాగమవుతారు. వారి సొంత పనులకు ఆసరాగా ఉంటారు. ఆఫీసులో ఉన్న కంప్యూటర్ ద్వారా సభ్యుల పెన్షన్‌కు సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలు నిర్వహిస్తారు. ఆదాయపు పన్ను రిటర్నులు అక్కడి నుండే పంపిస్తుంటారు. జీవిత భాగస్వామిని కోల్పోయిన డిపెండెంట్ పెన్షనర్ మహిళలకు ఒక్కసారిగా అంతా అగమ్యంగా ఉంటుంది.
సంఘం బాధ్యులు వెంటనే వారికి కలిసి మేమున్నామంటూ పెన్షన్ పనులు చక్కదిద్దుతారు. వారి పేరిట పెన్షన్ మంజూరుతో పాటు ఎప్పటికప్పుడు ఎరియర్స్ లెక్కలు, టాక్స్ చెల్లింపు లాంటి విషయాల్లో కూడా బాధ్యత తీసుకుంటారు. పెన్షనర్ ఒంటరి కాదు, ఆయనకంటూ ఓ బలగముంది, అన్ని సమయాల్లో అది తోడు నిలుస్తుంది అనే ధీమా ఇచ్చే ఆశ్రయాలు ఇప్పటికే చాలా చోట్ల ఉండవచ్చు. ఎన్నో అవసరాలు తీర్చే ఈ కల్పతరువులు ఊరూరా ఉండాల్సిందే! సెకండ్ ఇన్నింగ్స్‌లో డే వన్ వీటి నీడలోనే మొదలవ్వాలి. ప్రభుత్వ పెన్షనర్ల బాధ్యత ఇంతటితో తీరిపోదు. ఉద్యోగం కాకుండా వివిధ వృత్తుల్లో జీవితాలు కొనసాగించిన వారిని కూడా తమలో కలుపుకొని పోవాలి. విశ్రాంత జీవనం ఉద్యోగికి కాదు, వయసు మీరినవారంతా విశ్రాంత జీవులే. పెన్షన్ పక్కనబెడితే వృద్ధాప్యంలో వచ్చే చాలా సమస్యలు అందరివీ ఒకేలా ఉంటాయి. సంఘం నిర్వహణపై ఎలాంటి హక్కు లేకుండా గౌరవ సభ్యులుగా పెన్షనేతరులను కలుపుకొని పోవచ్చు. ఒంటరిగా బలహీనులే కావచ్చు, సంఖ్యాపరంగా ఒక్కటైతే వారు బలవంతులే. ఏ సందర్భంలోనైనా తమ సత్తా చూపవచ్చు. తన ఉనికిని నాటవచ్చు.
– బి.నర్సన్, 9440128169