
ప్రపంచ భద్రతకు గ్రీన్‌లాండ్ కీలకం, వెనక్కి తగ్గేది లేదంటున్నారు ట్రంప్. వెనిజువెలా తర్వాత ట్రంప్ గ్రీన్‌లాండ్‌పై కన్నేయడంతో ప్రపంచం నివ్వెరపోతోంది. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓ వైపు యూరప్ దేశాలతో వ్యాపారం కోసం ఒప్పందాలు చేసుకుంటూ.. మరోవైపు వారిపైనే సుంకాలు విధిస్తానని బెదిరింపులకు దిగడంతో ట్రంప్‌కు ఆయా దేశాలు షాకిచ్చాయి. అమెరికాతో కుదుర్చుకుంటున్న ట్రాన్స్ అట్లాంటిక్ వాణిజ్య ఒప్పందానికి బ్రేక్ వేశాయి. వెనెజువెలా అధ్యక్షుడు మదురోపై దాడిచేసి ఎత్తుకొచ్చిన ఘటనను వారికి గుర్తు చేస్తున్నారు. అయితే యూరప్ దేశాలు మాత్రం ఈ బెదిరింపులకు లొంగేందుకు సిద్ధంగా లేవు. దీంతో గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ బెదిరింపులకు నిరసనగా.. యూరోపియన్ పార్లమెంట్ అమెరికాతో గత జులైలో సంతకం చేసిన వాణిజ్య ఒప్పందం అమలును తాత్కాలికంగా నిలిపేసింది. ట్రంప్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ మధ్య గతజులైలో వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇయు వస్తువులపై అమెరికా సుంకాలను 15 శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించారు. బ్లాక్ అమెరికన్ ఎగుమతులపై సుంకాలను కూడా తగ్గించారు.
అయితే ఇప్పుడు గ్రీన్‌లాండ్ కబ్జా కోసం చేస్తున్న ప్రయత్నాలతో తాజా పరిణామాలు ట్రంప్‌కి షాకిచ్చాయనే చెప్పాలి. ఆర్కిటిక్ ద్వీపమైన గ్రీన్‌లాండ్‌లో మోహరింపు కోసం దళాలను పంపిన యూరోపియన్ దేశాలపై ట్రంప్ అదనంగా 10% సుంకాన్ని ప్రకటించారు. జూన్ 1 నుండి ఇది 25 శాతానికి పెరుగుతుందని, గ్రీన్‌లాండ్ పూర్తి కొనుగోలు కోసం ఒక ఒప్పందం కుదిరే వరకు అమలులో ఉంటుందని తెలిపారు. గ్రీన్‌లాండ్ పేరు వెనుక కారణం చారిత్రక మార్కెటింగ్ వ్యూహంగానే భావించాలి. దీనిపేరుకు విరుద్ధంగా ఇది నాలుగింట మూడు వంతులు మంచుతో కప్పబడి ఉంది, అయినప్పటికీ పురాతన కాలంలో పచ్చగా ఉండేదని, ప్రస్తుతం ఖనిజ వనరులు, వ్యూహాత్మక ప్రాముఖ్యత, పునరుత్పాదక ఇంధన వనరులు వంటి కారణాల వల్ల దీనికి ప్రాముఖ్యత పెరిగింది. గ్రీన్‌లాండ్ ప్రాంతం ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్నందున, ఇది అమెరికాకు రక్షణ వ్యూహాల్లో ముఖ్యమైనది. ఇక్కడ విలువైన ఖనిజాలు అంటే గ్రాఫైట్, లిథియం, టైటానియం వంటివి, రత్నాలు విరివిగా లభిస్తాయి. ప్రపంచంలోనే అత్యధిక శాతం పునరుత్పాదక ఇంధనాన్ని ముఖ్యంగా జలవిద్యుత్‌కి ఇది ఎంతో ఉపయోగకరమయింది. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం, డెన్మార్క్ రాజ్యానికి స్వయం ప్రతిపత్తి గల ప్రాంతం.
1979లో డెన్మార్క్ దీనికి స్వాతంత్య్రాన్ని ప్రసాదించింది. ప్రపంచంలోని అతి పెద్ద దీవి ఇది. అంటార్కిటికా తరువాత అత్యధికంగా ఐస్‌పొరతో నిండిన భూభాగం ఇదే. ట్రంప్ గ్రీన్‌లాండ్ స్వాధీన హెచ్చరికల నేపథ్యంలో తాము డెన్మార్క్ యూనియన్‌లోనే కొనసాగుతామని గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడెరిక్ నీల్సన్ విస్పష్ట ప్రకటన చేశాడు. అమెరికా, డెన్మార్క్‌లలో ఏ దేశంతో కొనసాగుతారని తమకు ఎంపిక అవకాశం ఇస్తే తాము యూరోపియన్ యూనియన్‌లో భాగంగానే ఉంటామన్నారు. అంతర్జాతీయ సంబంధాలను ఎప్పుడూ కూడా ఒక వ్యాపార ఒప్పందంగా భావించడం ట్రంప్ వైఖరిని స్పష్టం చేసింది. ఎవరైతే తన నిర్ణయాలకు మద్దతు ఇస్తారో వారికి సుంకాల నుంచి రాయితీలు ఇవ్వడం, వ్యతిరేకించే వారిపై పెనాల్టీలు వేయడం అనే ఎక్స్ఛేంజ్ లాజిక్‌ను ఆయన అనుసరిస్తున్నాడు. జాతీయ భద్రత అనే కార్డును ట్రంప్ ఇక్కడ బలంగా వాడుతున్నాడు.
ఆర్కిటిక్ మహాసముద్రంలో రష్యా, చైనా ఉనికి పెరుగుతున్న సమయంలో గ్రీన్‌లాండ్ అమెరికాకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై నూక్‌లో చరిత్రలోనే అతిపెద్ద నిరసనలు చెలరేగాయి. ‘గ్రీన్‌లాండ్ అమ్మకానికి లేదు’ అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంస్కృతిని, స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటామని గ్రీన్‌లాండ్ వాసులు స్పష్టం చేశారు. గ్రీన్‌లాండ్‌కు మద్దతుగా ఆ దేశంలో యూరోపియన్ కంట్రీస్ తమ సైనిక సిబ్బందిని మోహరించాయి. జర్మనీ 13 మంది సిబ్బందితో కూడిన నిఘా బృందాన్ని పంపింది. నార్వే ఇద్దరు సైనిక సిబ్బందిని, నెదర్లాండ్స్ ఒక నావికాదళ అధికారిని గ్రీన్‌లాండ్‌కు పంపాయి. అదే విధంగా యుకె కూడా ఒక సైనిక బృందాన్ని గ్రీన్‌లాండ్‌కు తరలించింది. ఫ్రాన్స్ 15మంది, స్వీడన్ ముగ్గురు, ఫిన్లాండ్ ఇద్దరు సైనికులను పంపాయి. యూరోపియన్ యూనియన్ దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా గ్రీన్‌లాండ్‌లో సైన్యాన్ని మోహరించడం ప్రపంచ దేశాల్లో కొత్త చర్చకు దారితీసింది.
– జి. సత్యనారాయణ రాజు, 9030880709