
భౌగోళిక, సామాజిక, రాజకీయ తెలంగాణ రాలేదు తొలి మలి దశ
ఉద్యమంలో ధిక్కార స్వరం వినిపించిన యోధుడు ముచ్చర్ల
సత్తన్న జయంతి కార్యక్రమంలో వక్తల ఉద్ఘాటన
మన తెలంగాణ/ నాంపల్లి : రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిందే తప్ప భౌగోళిక, రాజకీయ, సామాజిక తెలంగాణ రాలేదని వక్తలు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో అధిక ప్రయోజనం పొందిన లబ్దిదారులు, ఆంధ్ర టీవీ ఛానెళ్లు, పత్రికల యాజమానులేనన్నారు. ఈమేరకు మంగళవారం రాత్రి రవీంధ్రభారతిలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, తెలంగాణ సాధన దిశగా ధిక్కార స్వరం వినిపించిన ఉద్యమయోధులు ముచ్చర్ల సత్తన్న 93వ జయంతి కార్యక్రమం జరిగింది. తొలుత దివంగత నేత సత్తన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రామచంద్రమూర్తి, కప్పరి ప్రసాద్, పాశం యాదగిరి, సినీ దర్శకులు శంకర్, జయధీర్ తిరుమలరావు, విమలక్క, మన తెలంగాణ దినపత్రిక సంపాదకులు దేవులపల్లి అమర్ పలువురు పాల్గొన్నారు. సభకి తెలంగాణ ఉద్యమకారులు పృథ్వీరాజ్ అధ్యక్షత వహించారు. తొలి, మలిదశ తెలంగాణ ప్రజా ఉద్యమంలో ముచ్చర్ల సత్తన్న కవి, రచయిత, ఉద్యమకారుడిగా ఇలా బహుముఖ రంగాల్లో తన దైన శైలిలో కీలక పాత్ర పోషించడంమే కాకుండా ఉద్యమకారులను ఉత్తేజపర్చి ముందుకు పరుగులు పెట్టించారని వారు గుర్తు చేశారు.
తెలంగాణలో అధికార మార్పిడి జరిగిందే తప్ప సంపూర్ణ తెలంగాణ రాలేదని ముచ్చర్ల సత్తన్న తన ధిక్కార స్వరాన్ని ఎలుగెత్తి చాటారని ఘనంగా శ్లాఘించారు. అప్పట్లోనే సత్తన్న కవిగా పాత్రికేయుడిగా పత్రికను నడిపారు. కొందరు రాజకీయ పదవి రాలేదని, మంత్రికాక పోయానన్న బాధ, భూములు దక్కలేదని, తన కుటుంబసభ్యులకు పదవులు రాలేదన్న కసితోనే ధిక్కార స్వరాన్ని వినిపించారు. కానీ సత్తన్న మాత్రం సంపూర్ణ తెలంగాణ కోసం తొలి, మలి దశ తెలంగాణ ప్రజా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిండచమే కాకుండా పదవిని తృణప్రాయంగా త్యజించిన గొప్ప నేత అని ప్రస్తుతించారు. తెలంగాణ ఏర్పడి సామాన్యులకు మేలు జరగడం లేదు.
ఈ దిశగా ప్రత్యామ్నాయంగా రాజకీయ వేదిక ఏర్పడాలి. సంపూర్ణ తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో తెరవెనుక ఆంధ్ర పెత్తందార్లు, పెట్టుబడుదారులు, కాంట్రాక్టర్లు ఇంకా తెలంగాణలో ఆధిపత్యం చేలాయిచడం సిగ్గుచేటని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. భద్రాచలం పక్కనే పలు మండలాలను ఆంధ్రలో విలీనం జరిగింది. అలానే తెలంగాణలో అన్నిస్థాయిలో ఆంధ్ర పెత్తనం సాగుతోందని, కాంట్రాక్టులతోపాటు అన్ని పనులూ వారే చేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా పలు కళాంశాల ప్రదర్శనలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.