Reading Time: < 1 minute

హైదరాబాద్: కుక్కలకు విషం పెట్టి చంపడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలకు మార్గదర్శకాలు జారీ చేశారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో వీధి కుక్కలను విషప్రయోగంతో చంపిన ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని గ్రామ పంచాయతీలకు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్టు మంత్రి సీతక్క తెలిపారు.  వీధి కుక్కల బెడద ఉందన్న నెపంతో అమానుషంగా కుక్కలను చంపడం చట్టవిరుద్ధం మాత్రమే కాదని, మానవత్వానికి పూర్తిగా విరుద్దమన్నారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని  సీతక్క పేర్కొన్నారు. 

రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామంలో వంద కుక్కలకు విషపూరిత ఇంజక్షన్లు ఇచ్చి చంపిన విషయం తెలిసిందే. గతంలో కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండల పరిధిలోని గ్రామాలలో 600 కుక్కలకు విషం పెట్టి చంపారు. యాచారం, కామారెడ్డి జిల్లాలో ఘటనలో సర్పంచ్, కార్యదర్శి, వార్డు మెంబర్‌పై జంతువులపై క్రూరత్వ నివారణ చట్టం కింద కేసు నమోదు చేసిన విషయం విధితమే. వీధి కుక్కల బెడద ప్రజలకు ఇబ్బందిగా ఉన్న మాట వాస్తవమేనని, వాటిని చంపడం చట్టరీత్యా నేరం మాత్రమే కాదు అని పర్యావరణ సమతుల్యతకు కూడా ముప్పు వాటిల్లుతుంది.