Reading Time: 3 minutes

కమ్యూనిస్టులు అంటే పీడిత తాడిత ప్రజల కోసం నిలబడే నిలదీసే నిక్కచ్చి పార్టీగా దేశంలో ఒక బలమైన గుర్తింపు ఉంది. ఎర్రజెండా అంటే కార్మిక కర్షక లోకానికి సబ్బండవర్ణాలకు ఒక అండ. నాటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకైనా, నిజాం నిరంకుశ శక్తులకైనా, జమీందారీ భూస్వామ్యవాదులకైనా, నేటి పెట్టుబడిదారి శక్తులకైనా ఎర్రజెండా అంటే వారికి వెన్నులోవణుకే. వారి పీడనను దోపిడీని ఎదుర్కొనడమే కాదు నేల కూల్చింది కూడా ఎర్రజెండానే. ఒక శతాబ్ద కాలంలో మనదేశంలో ఎన్నో పార్టీలు పుట్టాయి, కనుమరుగైపోయాయి. ఇతర పార్టీలలో కలిసిపోయాయి. వాటి ఆనవాళ్లు కూడా లేవు. అంతర్జాతీయ పార్టీగా ఉద్భవించిన కమ్యూనిస్టులకు మార్క్, లెనిన్, ఎంగెల్స్ లాంటి మహనీయులు ఆరాధ్యం ఆదర్శం. మావోను కూడా అభిమానించి, ఆయన ఆలోచనా విధానాన్ని అనుసరించే వారు ఉన్నారు. అనేక ప్రపంచ దేశాలలో ఆ పార్టీ పొందిన విజయాల స్ఫూర్తిగా మనదేశంలోనూ 1925 డిసెంబర్‌లో ఆవిర్భవించి ఆ పార్టీ దినదిన ప్రవర్ధమానమైంది. అనేక ఆటుపోటులు ఎదుర్కొంది. బ్రిటిష్ కాలంలో నిషేధానికి గురైంది.

నాడు స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలో భావసారూప్యత గల వ్యక్తులతోనూ సోషలిస్టు వాదులతోనూ కలిసి కమ్యూనిస్టులు ప్రయాణించవలసి వచ్చింది. తరువాత పార్టీలో చీలికలు వచ్చినా మార్గాలు ఎత్తుగడలు మారాయి. కానీ లక్ష్యసాధనలో తేడా లేదు. అంతర్జాతీయ రాజకీయాలను ఆకళింపు చేసుకొని స్థానిక పరిస్థితులకు అన్వయించు కోవడంలో వీరు విజయం సాధించారు.ఆ విధంగానే తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలపడమే కాదు అందులో క్రియాశీలకంగా పాల్గొన్నారు. అనేక రాష్ట్రాలలోనూ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమించారు. ప్రజలను ఉద్యమ దిశగా నడిపించడంలో సఫలమయ్యారు. బానిస సంకెళ్లను తెంచారు. గడీలను ధ్వంసం చేశారు. భూసంస్కరణలకు నాంది పలికారు. దున్నేవాడిదే భూమి అనే వారి నినాదం రైతులను కూలీలను కదిలించివేసింది. భూస్వాముల గుండెల్లో గునపాలు దింపింది. పేదలు, దళితులు, ఆదివాసీల హక్కుల రక్షణకు కంకణం కట్టుకున్నారు. కమ్యూనిస్టులు కార్మిక, కర్షక, విద్యార్థి అనుబంధ సంస్థలను స్థాపించి ఆయా వర్గాలను చైతన్యపరిచారు. అభివృద్ధి నిరోధక శక్తుల గుండెల్లో నిద్రపోయారు.

చరిత్ర పరిశీలించి చూస్తే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలను, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుతూ వస్తున్న వారు కమ్యూనిస్టులే. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. మిత్రపక్ష ప్రభుత్వాలైనా వారు చేసే తప్పులను ఎత్తి చూపడానికి వెనుకడుగు వేయలేదు. అలాంటి పరిస్థితులలో విపక్షంగానే వ్యవహరించారు. అసలు బూర్జువా పార్టీలకు మద్దతు ఇవ్వడం కూడా ఒక ఎత్తుగడ మాత్రమే. వారు వేసిన ఎన్నికల ఎత్తుగడ విమర్శలకు గురైనా చలించలేదు. ఎందుకంటే దేశం విచ్ఛిన్నం కాకూడదని, సార్వభౌమాధికారం దెబ్బ తినకూడదనే బలమైన ఆకాంక్ష వారిని ప్రగతిశీల శక్తులతో చేతులు కలిపేలా చేసింది. ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఆ పార్టీల నేతలు ప్రభుత్వ నిర్మాణంలో కీలకపాత్ర పోషించేవారు. అసలు 1950 -60 మధ్య అతి పెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వ స్థాపన చేసే స్థాయిలో ఉండేది. ఇదొక చరిత్రాత్మకమైన ఘట్టం. శతవసంతాల ఉత్సవాలను ముఖ్యంగా ఉద్యమాల కంచుకోట అయిన ఖమ్మంలో జరుపుకోవడం నిజంగా అభినందనీయం. ఇందులో అనేక పార్టీల సౌహార్ద్ర ప్రతినిధులు కూడా తమ సందేశం ఇవ్వడం జాతికి దిశానిర్దేశం చేయడమే.

పార్టీలో అంతర్గతంగా అనేక చర్చలు జరిగి భారత భవిష్యత్తు తీర్చిదిద్దడానికి తమ పాత్రను పునర్నిర్వచించుకోవాలి. ఉద్యమంలో తాము పోషించబోయే కీలకపాత్రను నిర్దిష్టంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలి. విమర్శలు, పునర్విమర్శలు జరగాలి. 100 సంవత్సరాల ప్రస్థానంలో తమ తప్పిదాలను ఒప్పుకోవాలి. మిత్రపక్షలతో, భావసారూప్యత గల పార్టీలతో ఉద్యమ నిర్మాణానికి సన్నద్ధం కావాలి. ఎప్పుడూ ప్రజలలో ఉండే విధంగా తమ కార్యక్రమాలను తయారు చేసుకోవాలి. అవే పార్టీకి జవసత్వాలు నింపుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలో ఎండగట్టి వారిని జాగృతం చేసే బాధ్యత కమ్యూనిస్టు పార్టీలదే. పౌర హక్కులకు వాటిల్లుతున్న భంగాన్ని ఐక్యంగా ఎదుర్కోవడానికి పథకాలు రచించాలి. ఈ ఉత్సవాలు కార్యకర్తలకు సరియైన దిశానిర్దేశం చేయాలి. దేశం ఎప్పుడు సంక్షోభంలో ఉన్నా కమ్యూనిస్టు పార్టీలు తమదైన సలహాలు, సూచనలతో దేశాన్ని ఒడ్డెక్కిస్తారు అనే నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవాలి. ఒకపక్క ట్రంప్ అస్తవ్యస్త విధానాలు ప్రపంచాన్ని సంక్షోభం లోనికి నెట్టివేస్తున్నాయి.

అదే విధంగా దేశంలోనూ అంకెల గారడీయే తప్ప తిరోగమనమే వేగంగా జరుగుతున్నది. ఈ దశలోనే కమ్యూనిస్టు పార్టీ తమ విధానాలను సక్రమంగా రూపొందించుకోవాలి. పాలక పక్షాలు సంక్షేమం నుండి క్రమంగా తప్పుకుంటున్న పరిస్థితిని ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యపరచాలి. ఆ దిశగానే పార్టీలో విస్తృతమైన చర్చజరగాలి. నాటి నాయకుల త్యాగాల స్ఫూర్తి నేటి తరం నాయకులలో ప్రతిబింబించాలి. అన్నిరాష్ట్రాలలోని శాఖలు చురుకుగా పాల్గొనాలి. మొదటగా జాతీయ పార్టీగా గుర్తింపు పొంది ప్రజలలో విశ్వాసం చూరగొనాలి. భారత రాజకీయాలపై తమదైన ముద్ర మళ్ళీ వేసేందుకు అహరహం నేతలు, కార్యకర్తలు కృషి చేయాలి. కమ్యూనిస్టు పార్టీలు ప్రజలకు దూరమయ్యాయని, ఉద్యమాలు నిర్మించడం లేదనే అపప్రధ నుండి బయటపడాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజా ఉద్యమాల ద్వారా నిలదీయాలి. కమ్యూనిస్టు పార్టీల కేడర్ చాలా బలమైనదిగా ఉండేది. కానీ కొంతకాలంగా బలహీనపడ్డట్లు, నిరుత్సాహ పడ్డట్లు కనిపిస్తున్నది. వారిని నేతలే కలుపుకుపోతూ పోరాట బాటలో ముందుకు సాగాలి. ఆ పార్టీలకు ఒక్క ఓటు కూడా తగ్గదు. వారి కమిట్మెంట్ అలాంటిది. కానీ ఈ మధ్య ఒక్క ఓటు కూడా పెరగడం లేదన్న వాస్తవాన్ని కూడా గ్రహించాలి. ఓట్ షేర్ పెంచుకునే ప్రయత్నం బలంగా చేయాలి. ఎక్కడ వెనుకబడుతున్నామో పునర్విమర్శ చేసుకుని ముందడుగు వేయాలి.

వందేళ్ళ చరిత్రలో ఉద్యమాల నేపథ్యంతో ఎన్నో విజయాలతో ఒక బలమైన ప్రగతిశీల ప్రత్యామ్నాయంగా ఎదగవలసిన అవసరం ఆ పార్టీలకు నేడున్నది. ‘దేశభక్తి వాడికి ముత్తాతగాడి సొత్తు; నిజమాడేవాడేమో పరదేశపు తొత్తు’. నిజం చెబితే నేరం, వాస్తవం మాట్లాడితే ద్రోహం అవుతున్న రోజులవి. దేశ స్వాతంత్య్రంతో సంబంధం లేని పార్టీలు నేడు చేతులు అధికార పగ్గాలతో దేశ భవిష్యత్తును అంధకారం వైపు నడిపిస్తున్న పరిస్థితి నెలకొన్నది. అందుకు కమ్యూనిస్టు పార్టీలు అభ్యుదయ శక్తులు మౌనం వహించినా లేదా కేవలం ప్రకటనలకే పరిమితమైనా అది ద్రోహమే అవుతుంది. ఇప్పటికీ పల్లెల్లో ఎర్రజెండాను నమ్ముకున్న వారున్నారు. ఈ ఉత్సవాలు వారిలో స్ఫూర్తి నింపాయని భావించుదాం. ప్రగతిశీల శక్తులు, అభ్యుదయ వాదులు ఒక తాటి మీదకు రావలసిన పరిస్థితి నెలకొన్నది. సంఘటితం కావలసి ఉన్నది. ఈ ఉత్సవాలు ఆ దిశగా నడిపిస్తాయని ఆశిద్దాం. కొత్త లేబర్ కోడ్లు, నూతన ఉపాధి పథకం జి రామ్ జి, రాబోయే పెన్షన్ చట్టాలు ప్రజా వ్యతిరేకమైనవి.

కార్మిక కర్షక వర్గాలకు అన్యాయం చేసేవి. విదేశాంగ విధానం కూడా అస్తవ్యస్తంగా ఉంది. పొరుగు దేశాలతో ఉన్న ముప్పు ప్రతి నిమిషం కలవరపెడుతోంది. ఇవన్నీ దేశం ఎదుర్కొంటున్న సమస్యలు. పెట్టుబడిదారీ శక్తులకు ఊతమిస్తూ పక్క రాజ్యాలను కబళిస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాదం, ఆధిపత్యవాదం ప్రపంచానికి నేడు పెను సవాల్‌గా పరిణమించింది. ఇవన్నీ నేడు కమ్యూనిస్టు పార్టీల ముందున్న సవాళ్లు. అందరూ ఐక్యంగా చర్చించాలి. అందుకు వామపక్ష మేధావులు క్రియాశీలక పాత్ర పోషించాలి. పోరాట పంథాను బలోపేతం చేయాలి. ఆ దిశగా ప్రజలను నడిపించాలి. జెండా మరింత ఎరుపెక్కాలి. కమ్యూనిస్టులు ఎన్నికల సమయంలో మాత్రమే కనపడే పార్టీలు కావు. నిత్యం ప్రజలతో మమేకమై ఉండేవే. నేతల సందేశాలు కేడర్‌లో కొత్త శక్తిని ఇచ్చాయి అనడంలో సందేహం లేదు. నూతన ఉత్తేజాన్ని నింపాయి. గత విజయాల పునాదుల మీద వర్తమాన భవిష్యత్తు భారతానికి బాటలు వేయాలి. ఉత్సవాలు విజయవంతమయ్యాయి. కానీ అవి జాతీయ, రాష్ట్ర నేతల మీద మరింత బాధ్యతను పెంచాయని గ్రహించాలి. భారతదేశపు భవిష్యత్తు రాజకీయాలు కమ్యూనిస్టు పార్టీలు కేంద్రకంగా నడవాలి. ‘ఉద్యమాలు పొందవచ్చు తాత్కాలిక పరాజయం; ఆఖరి సంగ్రామంలో అరుణారుణ మహోదయం’ అన్న మహాకవి శ్రీశ్రీ మాటలను కమ్యూనిస్టు పార్టీలు నిజం చేయాలి.

– శ్రీ శ్రీ కుమార్