Reading Time: 2 minutes

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాకుండా విపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాల్లో ఉన్న గవర్నర్లు ఏదో ఒక విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ఘర్షణ వైఖరిని అవలంబించడం గత కొన్నేళ్లుగా జరుగుతున్నదే. రాజ్యాంగం ప్రతినిధులమని చెప్పుకున్నా కేంద్రం కనుసన్నల్లో నడిచే తాబేదార్లుగా కొందరు గవర్నర్లు వ్యవహరించడం విస్మయం కలిగిస్తోంది. గవర్నర్ అంటే ఒక రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతి. కేంద్ర స్థాయిలో భారత రాష్ట్రపతికి ఉన్న అధికారాలు, విధులు రాష్ట్రస్థాయిలో గవర్నర్‌కు ఉంటాయి. రాజ్యాంగ అధిపతిగా గవర్నర్ ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహా ఆధారంగా అన్ని నిర్ణయాలు తీసుకోవడం రాజ్యాంగ విధి. అయితే కేంద్రం లోనూ, రాష్ట్రాల్లోనూ వివిధ రాజకీయ వ్యవస్థలు పాలించడం ప్రారంభం కావడంతో రాజ్యాం గపరంగా అనుసరించాల్సిన విధానాలు గాడి తప్పుతున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో అప్పటి గవర్నర్లు ప్రభుత్వ ఏజెంట్లుగా ఉండేవారు. కానీ మనది ప్రజాస్వామ్య దేశం. ఆ పద్ధతి, ఆనవాళ్లు ఇంకా కనిపిస్తుండడం తీరని కళంకం. కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ప్రభుత్వ ఏజెంట్లుగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రుల మధ్య సంఘర్షణ వైఖరి కొనసాగుతుండడం పాలనా వ్యవహారాలకు ప్రతిబంధకమవుతోంది. ఇప్పుడు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో గవర్నర్లు మంగళవారం (20.1.26) సంఘర్షణ వైఖరిని అవలంబించడం తాజాగా తలెత్తిన వివాదంగా తెరపైకి వచ్చింది.

మంగళవారం తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి అసెంబ్లీ సమావేశంలో స్టాలిన్ ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని చదవడానికి నిరాకరించి అనూహ్యంగా సభనుంచి నిష్క్రమించారు. సాధారణంగా అన్ని శాసనసభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ముందు, తరువాత జాతీయ గీతం ఆలపిస్తారని, కానీ ఇక్కడ అలా చేయకుండా జాతీయ గీతాన్ని అవమానించారని, అంతేకాకుండా గవర్నర్ ప్రసంగానికి సిద్ధమవుతున్న తరుణంలో పదేపదే మైక్ కట్ చేశారని ప్రధాన ఆరోపణలు లోక్‌భవన్ (రాజ్‌భవన్)నుంచి వెలువడ్డాయి. అంతేకాదు ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగంలో అనేక వ్యత్యాసాలు, నిరాధార ఆరోపణలు ఉన్నాయని ఆరోపించారు. ఇక కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ పాఠంలోని 12, 15 పేరాల అంశాలను చదవకుండా విడిచిపెట్టడం వివాదానికి దారితీసింది. చివరకు స్పీకర్ ఎంఎన్ షంసీర్ జోక్యం చేసుకుని కొన్ని అంశాలను వదిలేస్తూ గవర్నర్ చేసిన ప్రసంగాన్ని అధికారికంగా గుర్తించబోమని, నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన విధాన ప్రసంగాన్నే అధికారికంగా భావిస్తామని ప్రకటించవలసి వచ్చింది. అసెంబ్లీ సమావేశంలో సంప్రదాయం, నైతికతను ఉల్లంఘించి ప్రభుత్వ ప్రసంగం చదవకుండా గవర్నర్ బహిష్కరించడం సరైన చర్యకాదు. అలాగే ప్రసంగం కాపీ గవర్నర్ అభిప్రాయాలకు అనుగుణంగా తయారు చేయాలన్న నిబంధన కూడా ఎక్కడాలేదు.

గత ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్ రవికి మధ్య విభేదాలు తలెత్తి ప్రతిష్ఠంభన ఏర్పడగా, సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని గట్టిగా మందలించింది. ఆనాడు తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం కూడా వివాదాలకు దారితీసింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం చదవకుండా గవర్నర్ స్వంతంగా ప్రసంగం చేశారని ముఖ్యమంత్రి స్టాలిన్, మంత్రిమండలి ధ్వజమెత్తారు. అయినా ఇప్పటికీ గవర్నర్ రవి వైఖరిలో మార్పు రావడం లేదు. మంగళవారం ఏదైతే జరిగిందో ఆనాడు ఇదే విధంగా జాతీయ గీతం ఆలపించకుండా ద్రవిడ సంప్రదాయ గీతాన్ని ఆలపించారని గవర్నర్ రవి కోపంతో సభనుంచి అర్ధాంతరంగా నిష్క్రమించడం గవర్నర్ దుందుడుకు చర్యగా విమర్శలకు దారితీసింది. 2022 లో అప్పటి కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, కేరళ ప్రభుత్వం సిఫారసు చేసిన ఆర్డినెన్సులు జారీ చేయకుండా నిలిపివేయడం వివాదానికి దారితీసింది. ప్రభుత్వం ప్రత్యేక శాసనసభ సమావేశంలో ఆమోదించిన యూనివర్శిటీల బిల్లు తదితర బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయకుండా పెండింగ్‌లో ఉంచారు.

అలాగే గవర్నర్లు తమ బిల్లులను ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నారని తమిళనాడు, కేరళ, పంజాబ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడు శాసనసభ గవర్నర్ ఆమోదం కోసం పంపిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ రవి ఎలాంటి పరిశీలన చేయకుండా మూడేళ్లుగా తనవద్దే అట్టేపెట్టుకోవడం అత్యంత వివాదాస్పదమైంది కూడా. పశ్చిమబెంగాల్‌లో గవర్నర్ సివి ఆనందబోస్‌కు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య చాలా విషయాల్లో తీవ్ర ప్రతిఘటన కొనసాగింది. తెలంగాణలో గతంలో అప్పటి గవర్నర్ తమిళిసై సెల్వరాజన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చాలా రోజులు వైరుధ్యం కొనసాగింది. 2008 లో మేఘాలయ, 2007లో కర్ణాటక, 2005 లో గోవా, బీహార్, జార్ఖండ్ గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య రగడ సాగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. విపక్ష పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో ఎంతగట్టిగా సంఘర్షిస్తే అంత గొప్పగా మోడీ ప్రభుత్వ ప్రశంసలకు పాత్రులవుతామని ఆయా గవర్నర్లు భావిస్తున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అలాగే ఈ సంఘటనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం చూస్తుంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్లు బాగానే ముప్పతిప్పలు పెడుతున్నారని పైశాచిక ఆనందం పొందుతున్నదా అన్న ప్రశ్న తలెత్తక మానదు.