
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే నాడు లేదా జనవరి 26కు ముందే టెర్రరిస్ట్ దాడికి కుట్ర జరుగుతోందని నిఘావర్గాలు హెచ్చరించడంతో భద్రతా దళాలు బుధవారం ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించాయి. దాడి కోడ్ 26-26 గా వ్యవహరిస్తున్నారు. టెర్రరిస్ట్ లు అయోధ్య లోని బాల రామాలయం, జమ్మూ లోని రఘునాథ్ ఆలయాలతో పాటు ఇతర ముఖ్య దేవాలయాలను, నగరాలను టార్గెట్ చేసుకునే అవకాశం ఉందని భద్రతాదళాలకు సమాచారం అందడంతో అంతటా అప్రమత్తం అయ్యారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు సమాచార వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ సైనిక గూఢచారి సంస్థ ఐఎస్ ఐ. జైష్-ఎ-మొహమ్మద్ ద్వారా, పంజాబ్ కు చెందిన గ్యాంగ్ స్టర్ల సహాయంతో ఈ దాడిని ప్లాన్ చేస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. నవంబర్ 9న ఎర్రకోట వెలుపల జరిగిన కార్ బాంబు దాడిలో 15 మంది మరణించారు. ఈ దాడికి తామే కుట్ర పన్నినట్లు జేష్- ఏ- మొహమ్మద్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఒకపక్క కర్యవ్య పథ్ లో ప్రతిష్టాత్మక రిపబ్లిక్ డే పరేడ్ , సంగీత నృత్య ప్రదర్శలు జరుగనున్న నేపథ్యంలో భద్రతా సంస్థలు ముందుగానే, ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం అంతటా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. బస్, రైల్వే స్టేషన్లు వంటి ప్రదేశాలలో మోస్ట్ వాండెట్ వ్యక్తుల పోస్టర్లను ఏర్పాటు చేసి, ప్రజలను అప్రమత్తం చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన పోస్టర్లలో ఢిల్లీ లోని చౌహాన్ బంగర్ కు చెందిన మొహమ్మద్ రెహాన్ కూడా ఉన్నాడు. 2016లో ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ లో అల్ ఖైదా మాడ్యూల్ ను ఛేదించి నప్పుడు అతడు తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇతరులలో మొహమ్మద్ ఉమర్, అబు సుఫియాన్, మొహమ్మద్ షాహిద్ ఫైసల్, సయ్యద్ అర్షియా,షార్జిల్ అఖ్తర్ ఉన్నారు. వీరికోసం ఢిల్లీ అడుగడుగునా గాలింపు జరుగుతోంది. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు ముందు ఎప్పటి లాగానే, ప్రొటోకాల్ మాదిరిగా భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయి.
ఒక పక్క ఖలిస్తానీ టెర్రరిస్ట్ సంస్థలు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని నిఘావర్గాలు హెచ్చరించగా, పంజాబ్ కు చెందిన పాత నేరస్థులు వారికి తోడ్పడే ముప్పు ఉండడంతో భద్రతను ముమ్మరం చేశారు. ఒక పక్క కట్టుదిట్టమైన భద్రతా వలయం ఏర్పాటు చేస్తున్నా, మరో పక్క కశ్మీర్ కు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ తో మిలాఖత్ అయిన టెర్రరిస్ట్ విభాగం ఫాల్కన్ స్క్వాడ్ కూడా తాజాగా హెచ్చరికతో కూడిన ప్రకటన ముప్పు ప్రమాదాన్ని మరింత పెంచింది. ఇది పాకిస్తాన్ కు చెందిన మరో టెర్రరిస్ట్ సంస్థ లష్కర్ -ఏ-తోయిబా అనుబంధ సంస్థగా పరిగణిస్తున్నారు. 2019లో కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు చేసిన తర్వాత ఆవిర్భవించిన లష్కర్ శాఖ, గత ఏడాది ఏప్రిల్ లో పహల్గాం లో దాడికి బాధ్యతవహించింది. 26 మంది హిందువుల ఊచకోత కు ప్రతిస్పందనగా , భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ , రెండు దేశాల మధ్య సాయుధ ఘర్షణ, కాల్పుల విరమణ తెలిసిందే.