Reading Time: 2 minutes

దావోస్: ఓ చిన్న మంచుగడ్డ గ్రీన్‌లాండ్‌ను అమెరికా కోరుకొంటోందని దావోస్‌లో ఆరంభమైన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్లుఇఎఫ్) సదస్సులో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ ప్రాంత కీలక నైసర్గిక స్వరూపం నేపథ్యంలో ప్ర పంచ శాంతి కోసం, ప్రపంచ పరిరక్షణకు దీని ని అమెరికా కావాలనుకొంటోందని ట్రంప్ చె ప్పారు. దీనిని అమెరికాకు ఇవ్వాల్సిందే అని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. బుధవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్ సమీపంలోని రిసార్ట్ సిటీలో గ్రీన్‌లాండ్‌పై ప్ర పంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఏ ఇతర దేశం కూడా అమెరికా కన్నా ఈ గ్రీన్‌లాండ్‌కు భద్రత కల్పించలేదు. ఇది నిజం. దీని ని ఎవరూ కాదనలేరని తేల్చిచెప్పారు. గ్రీన్‌లాండ్‌ను ఆశిస్తున్నాం. దీనిని తాము దక్కించుకోవల్సి ఉందన్నారు. అయినా గ్రీన్‌లాండ్ ఓ చిన్న కోరిక. ఇది మంచు తునక, ఐస్ లాండ్. దీనిని స్వాధీనపర్చుకునేందుకు తాము బలప్రయోగానికి దిగాల్సిన అవసరం లేదన్నారు. ఆయన ప్రసంగం ఎక్కువగా గ్రీన్‌లాండ్ ప్రస్తావనతోనే సాగింది. గ్రీన్‌లాండ్‌ను కంట్రోలులోకి తీసుకునేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపడం తెలివితక్కువ పని అవుతుంది. ఇదే సమయంలో గ్రీన్‌లాండ్‌ను అమెరికా వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుందని వ్యాఖ్యానించారు. గ్రీన్‌లాండ్ కైవసానికి తమ మార్గాలు తమకు ఉంటాయని పరోక్షంగా తెలిపారు.

గ్రీన్‌లాండ్ ఐస్ ముక్కనే కావచ్చు. అయితే అది ఆర్కిటిక్ ప్రాంతంలో వ్యూహాత్మక ఆయువుపట్టు. ఈ ప్రాంతం రక్షణ బాధ్యతను అమెరికానే జాగ్రత్తగా చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. గతంలోనే తెలివితక్కువతనంతోనే ఈ ప్రాంతాన్ని అమెరికా వదులకుంది. ఇందుకు కారణం ఎవరనేది ప్రస్తావించదల్చుకోలేదు. డెన్మార్క్ సొంతంగా గ్రీన్‌లాండ్‌ను రక్షించలేదు. డెన్మార్క్ బలహీనతలు డెన్మార్క్‌కు ఉండనే ఉన్నాయి. ఇక గ్రీన్‌లాండ్‌ను అమెరికా లీజుపై తీసుకుంటే ప్రయోజనం ఉండదు. లీజ్ పరిధిలో పూర్తి స్థాయి భద్రత కుదరదని తేల్చిచెప్పారు. ఈ ప్రాంతం చిన్న ఐస్‌పీస్ కావచ్చు. అయితే భౌగోళిక వ్యూహాత్మక దిశలో చూస్తే ఇది అమెరికాకు అవసరం అన్నారు. పైగా గ్రీన్‌లాండ్ ఉనికి పరిరక్షణ బాధ్యత అమెరికా చూసుకుంటుందన్నారు. గ్రీన్‌లాండ్‌కు డెన్మార్క్‌కు తరతరాలుగా అమెరికా ఇచ్చిన దానితో పోలిస్తే తాము కోరుకుఉంటున్నది తక్కువే అని ట్రంప్ అన్నారు. తమకు గ్రీన్‌లాండ్ కావల్సిందేనని స్పష్టం చేశారు. గ్రీన్‌లాండ్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెత్తనం ధోరణిని ఖండిస్తూ వస్తోన్న పలు ఐరోపా దేశాలకు ట్రంప్ ఈ వేదిక నుంచి ఘాటైన హెచ్చరికలు వెలువరించారు. గ్రీన్‌లాండ్‌పై అమెరికా వాదనను వ్యతిరేకించే వారిని తాము ఎప్పుడూ గుర్తుపెట్టుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. అయితే సమ్మతించే వారిని, సమ్మతించని వారిని గుర్తు పెట్టుకుంటామని ఐరోపా దేశాలకు ట్రంప్ చురకలకు దిగారు.

దారి తప్పిన ఐరోపా దేశాలు

ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్లుఇఎఫ్) కీలక సమావేశాల ఆరంభంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఐరోపా దేశాలపై విరుచుకుపడ్డారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల దశలో బుదవారం ఇక్కడ జరుగుతున్న ఐదు రోజుల సదస్సులో ఆయన తమ మిత్రదేశాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరోపియన్ యూనియన్ సరిగ్గా తమ బాధ్యతలు నిర్వర్తించడం లేదని మండిపడ్డారు. పలు ప్రపంచ సమస్యలు రగులుకుంటున్నాయి. అయితే వీటి విషయంలో ఐరోసా దేశాల స్పందన , కనబరుస్తున్న కార్యాచరణ సరిగ్గా లేదని విమర్శించారు. అక్రమ వలసలపై ఐరోపా దేశాల్లో సరైన నియంత్రణ లేదు. దీని పరిణామాలు అంతర్జాతీయంగా దుష్పలితాలకు దారితీస్తోంది. అత్యంత కీలకమైన నిర్మాణాత్మక పాత్ర వహించాల్సిన దేశాలు ఇప్పుడు చేతలుడిగి వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు తమ హయాంలో అమెరికా అభివృద్ధి పథంలో దూసుకువెళ్లుతున్నదని, రెండేళ్ల క్రితం బలహీన ఆర్థిక వ్యవస్థ లక్షణాలున్న దేశం నిర్జీవ వ్యవస్థతో ఉన్న దేశం

ఈ రెండో దఫా తమ అధికారం తొలి ఏడాదిలో తిరిగి బలోపేతం అయిందని తెలిపారు. ఈ సదస్సుకు హాజరైన తన మిత్రులకు , కొందరు శత్రువులకు కూడా తన శుభాకాంక్షలు అని తెలిపిన ట్రంప్ నిజాలు పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించడం యూరప్ దేశాల పతనానికి దారితీసిందన్నారు. ఇప్పుడు అపార వనరులున్న దేశాలకు కూడా చైనా తన ఉత్పత్తులు అంటగడుతోందని తెలిపారు. చాలాకాలంగా ఆర్థిక నష్టాల్లో ఉన్న అమెరికా ఆర్థిక పరిస్థితి చక్కదిద్దేందుకు తాము కొన్ని దేశాలపై విధించిన సుంకాలతో సత్ఫలితాలు దక్కుతున్నాయని ట్రంప్ చెప్పారు. తమ భారీ సుంకాలను ఈ ఆర్థిక సదస్సులో సమర్థించుకున్నారు. అమెరికా ఇప్పుడు ప్రపంచ ఆర్థిక ఇంజిన్ అయిందన్నారు. తాను ఎంతగానో ఇష్టపడే ఐరోపా దేశాల్లో కొన్నింటికి ఇప్పటికీ సరైన గుర్తింపు లేదని, ఇందుకు కారణం అవి కీలక విషయాలపై సవ్యమైన రీతిలో వ్యవహరించకపోవడమే అన్నారు.