Reading Time: 2 minutes

మన తెలంగాణ/సిటీబ్యూరో: సింగరేణి టెండర్ల వ్యవహారంపై బహిరంగ చర్చకు సిద్దమని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు, బీజెపి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఓపెన్ చాలెంజ్ చే శారు. వేదికను ఎంపికచేసి చర్చకు పిలిస్తే.. ఎక్కడికైనా వస్తానని, 2014 నుండి 2025 అక్టోబర్ నాటికి మైనింగ్ టెండర్లపై చర్చిద్దాం రండీ అంటూ మంత్రి పొన్న ప్రభాకర్ సవాల్ విసిరారు. జీహెచ్‌ఎం సి కార్యాలయంలో మీడియాతో బుధవారంమాట్లాడుతూ.. టెండర్ల పై విచారణకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మీరు లేఖలు రాస్తే వి చారణకు ప్రభుత్వం కోరుతుందని మంత్రి పొన్నం స్పష్టంచేశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారని, తీరా ప్రభుత్వం సీబీఐ విచారణకు అనుమతిస్తే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావులు కలిసి వ్యూహాత్మకంగా సింగరేణి అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. అసలు విషయాలను పక్కదారి పట్టించేందుకే ఇప్పుడు సింగరేణిపై సీబీఐ ఎంక్వైరీ కావాలంటున్నారని ఎద్దేవా చేశారు. 2014 నుండి 2025 వరకు 20 టెండర్లను నిర్వహిస్తే.. అందులో కేవలం 5 టెండర్లు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిందనీ, ఇందులో ఒక టెండర్ మాత్రమే 0.01 శాతం ప్లస్‌గా వచ్చిందే తప్ప మిగతా నాలుగు టెండర్లు మైనస్‌లోనే ఉన్నాయని మంత్రి ప్రభాకర్ వివరించారు. మిగతా టెండర్లు రిజర్వ్ బిడ్‌కన్నా.. ప్లస్‌తోనే నిర్వహించారని మంత్రి విమర్శించారు.

మైనస్ శాతంతో ఇచ్చాం..

సింగరేణి అలాట్‌మెంట్స్ వివరాలను తెప్పించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కిషన్ రెడ్డి, హరీష్ రావులను మంత్రి డిమాండ్ చేశారు. ‘2014 నుంచి సింగరేణిలో ఇచ్చిన ఒకే ఒక్క కాంట్రాక్ట్ మినహా.. మిగతా కాంట్రాక్టులన్నీ ’ఎక్స్‌ట్రా’ (అదనంగా/నామినేషన్ పద్ధతిలో) గానే ఇచ్చారని నిరూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. నా సవాల్ స్వీకరించే దమ్ముందా?‘ అని ప్రతిపక్ష నేతలను ప్రభాకర్ ప్రశ్నించారు. విమర్శలకు వేదిక అయిన నైని బ్లాక్ పై +38 శాతం తో బీఆర్‌ఎస్ హయాంలో చేసిన కేటాయింపుల టెండర్ రద్దయింది..తెలంగాణ ఏర్పడిన తరువాత 2014 నుంచి ఇచ్చిన ఓసిపికి సంబంధించి 20 ఇచ్చారు.. ఒకటి 37 శాతంతో ఎక్సెస్‌గా ఇచ్చారని మంత్రి ఆరోపించారు. పాత ప్రభుత్వంలో వెంకటేష్ ఓపెన్ కాస్ట్ కాంట్రాక్ట్ టెండర్ తీసుకున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో తీసుకుంటే లేని బంధుత్వం కాంగ్రెస్ హయాంలో ఇస్తే బంధుత్వం ఎలా ఏర్పడుతుందని మంత్రి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో 35.57 ఎక్సెస్‌తో 01.05 .2017న ఒక కంపనీకి ఇచ్చారనీ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో 2025 ఏప్రిల్, మే,జూలై ,అక్టోబర్ లో ప్రాజెక్ట్ ల్లో సైట్ ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాతే టెండర్లకు వెళ్ళింది. బీఆర్‌ఎస్‌లో అదేమి లేదని విమర్శించారు.

నాటకాలాపండి..

ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆడుతున్న నాటకాలను కట్టిపెట్టి, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాడేందుకు కలిసి రావాలని హితవు పలికారు. తెలంగాణకు కేంద్ర నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందని, హక్కుల కోసం కేంద్రాన్ని నిలదీద్దాం కలిసి రండి అని పిలిస్తే ప్రతిపక్ష నేతలెవరూ ముందుకు రావడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు సింగరేణి సంస్థపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని, ఆ రెండు పార్టీలు కలిసే తాము సేఫ్ జోన్‌లో ఉంటామని భావిస్తున్నాయని ఆరోపించారు. సింగరేణిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలు, ఎస్‌సీలు, ఎస్‌టీలు, మహిళలు మంత్రులుగా కొనసాగుతున్నారనీ, అదే బీఆర్‌ఎస్ హయాంలో కుటుంబ సభ్యులకే కీలక బాధ్యతలను అప్పగించారని మంత్రి విమర్శించారు. మీ పాలనలో మీరు, మీకొడుకు, మీ అల్లుడలకే పోస్టులు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీఅధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఉన్నాయని మంత్రి విమర్శలు గుప్పించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అత్యధికంగా రేషన్ కార్డులు మంజూరు చేశాం, 200 యూనిట్లకు కరెంట్ బిల్లులు మాఫీచేశాం, నీళ్ళు అందిస్తున్నాం. 48 గంటల్లో పంటల ఉత్పత్తిలను కొనుగోలు చేస్తున్నాం.మహిళలకు వడ్డీలేని రుణాలను మంజూరు చేస్తున్నామంటూ మంత్రి ప్రభాకర్ పేర్కొన్నారు.