Reading Time: 2 minutes

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: కేరళతోపాటు త్వరలో ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాల్లో బలా న్ని పెంచుకుంటామని సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజా తెలిపారు. ఖమ్మం నగరంలో నాలుగు రోజులుగా జరుగుతున్న సిపిఐ శతాబ్ది ఉత్సహాల్లో భాగంగా బుధవారం జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. సమావేశం అనంతరం రాజా మీడియాతో మాట్లాడుతూ.. కేరళను కాపాడుకోవడంతోపాటు త్వరలో ఎన్నికలు జరగనున్న మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కలిసివచ్చే శక్తులతో బలా న్ని పెంచుకుంటామన్నారు. దేశంలో లౌకికవాద ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని సమైక్య పోరా టం చేస్తామన్నారు. సంఘ్ పరివార్ శక్తులు కులా న్ని, మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నాయని వీటికి వ్యతిరేకంగా పోరాడతామన్నారు. సనాతన ధ ర్మం, మహిళలపట్ల వివక్ష కొనసాగుతుందన్నారు. మతతత్వ శక్తుల కారణంగా దేశంలో లౌకికవా దం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయన్నారు. విద్యారంగంలోనూ మతాన్ని చొప్పిస్తున్నారని, వి ద్యా వ్యవస్థను వ్యాపారమయంగా మార్చారని రా జా వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ పథకాన్ని పో రాడి సాధించుకుంటే దానిని రద్దు చేసేందుకు బిజె పి కుట్ర చేస్తుందని, ఇందుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెకు సిపిఐ సంపూర్ణ మద్దతునిస్తూ సమ్మె జయప్రదానికి కృషి చేస్తుందన్నారు. భారతదేశాన్ని నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మోడీ చెబుతున్నారని, కానీ దేశంలో నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని, ఆశ్రిత పెట్టుబడిదారి విధానంతో దేశం విచ్ఛిన్నం దిశగా ప్రయత్నిస్తుందని రాజా అన్నారు.

అంబానీ, అదానీలాంటి కార్పొరేట్ శక్తులు శ్రామిక జనులను దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. మోడీకి ఈ దేశంలో రైతులు, కార్మికుల గురించి పట్టదని, ఆయన ప్రేమంతా సంపన్న వర్గాలపైనేనని దుయ్యబట్టారు. ట్రంప్ సామ్రాజ్యవాద ధోరణితో వ్యవహరిస్తున్నా కనీసం ఖండించలేని స్థితిలో భారత ప్రధాని మోడీ ఉన్నారన్నారు. ట్రంప్ సామ్రాజ్యవాద ధోరణితో వ్యవహరిస్తూ అత్యంత ప్రమాదకారిగా మారుతున్నారని ఈ సమయంలో వెనెజువెలాకు తాము మద్దతుగా నిలుస్తున్నామన్నారు. వెనెజువెలాపై దాడి కేవలం ఆయిల్ సంపద కోసమేనని ఆయన స్పష్టం చేశారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయవద్దని భారత్ పై ఒత్తిడి తీసుకు వస్తున్నా మోడీ స్పందించడం లేదని నోరు మెదిపే సాహసం కూడా చేయలేకపోతున్నారని రాజా ఆరోపించారు. పాలస్తీనా, వెనెజువెలాకు అంతర్జాతీయ మద్దతు పెరుగుతుందన్నారు.పార్లమెంటును నిర్వీర్యం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తున్నారని బిజెపి పాలన ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో సాగుతుందని ఆయన తెలిపారు. గవర్నర్ల వ్యవస్థను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు స్థానిక ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతుందని ఆయన తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గవర్నర్ శాసించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగం నిర్వీర్యం అవుతుందని ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ప్రైవేట్‌పరం చేస్తున్నారని ఇటువంటి సమయంలో ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎయిర్‌పోర్టులు, ఓడరేవులు, అగ్రికల్చర్, ఎలసి, అణు విద్యుత్ కేంద్రాలను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని రాజా తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు ఖమ్మం నగరంలో అత్యంత వైభవంగా జరిగాయని పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ప్రదర్శనను, బహిరంగ సభను విజయవంతం చేశారన్నారు. ఈ ఉత్సవాలకు వేదికగా నిలిచిన ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఐ శాఖలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమం అంటే త్యాగాలు, పోరాటాలేనని ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలకు, పోరాటాలకు సమాయత్తం అవుతామని రాజా తెలిపారు. విలేఖర్ల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శులు రామకృష్ణ పాండా, పల్లా వెంకటరెడ్డి, కె. రామకృష్ణ, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా, ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేష్ పాల్గొన్నారు.