
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం లో జగిత్యాల నియోజకవర్గం బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.సంజయ్ ప్రత్యక్షమయ్యారు. దీంతో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మం త్రి టి.జీవన్ రెడ్డికి చిర్రెత్తింది. మన పార్టీ సమావేశానికి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఎలా హాజరవుతారంటూ ఆగ్రహం వ్యక్తం చే స్తూ సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇదంతా బుధవారం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమక్షంలోనే జరగడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం సాయంత్రం గాంధీ భవన్‌లో నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పార్టీ ముఖ్య నేతల సమావేశం మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభమైంది. అయితే ఈ సమావేశానికి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేకూడా హాజరుకావడంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఏ మాత్రం నచ్చలేదు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈ సమావేశంలో ఉండడం వల్ల తాను బయటకు వెళ్ళిపోతున్నానని చెప్పి బయటకు వచ్చేశారు. దీంతో అందరూ అవాక్కైయ్యారు. అయినప్పటికీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,
మహేష్ కుమార్‌గౌడ్ ఆయనకు నచ్చజెప్పే ప్రయ త్నం చేసినా వినిపించుకోకుండా ఆగ్రహంతో బయటకు వచ్చారు. అనంతరం జీవన్ రెడ్డి గాంధీ భవన్ ఆవరణలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌ను తమ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఎలా కూర్చోపెడతారని ఆగ్రహంగా ప్రశ్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇటీవల స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టిన సమయంలోనూ తాను పార్టీ మారలేదనీ, బిఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నానని స్పీకర్‌కు అఫిడవిట్ దాఖలు చేశారని ఆయన ఉదహరించారు. పదేళ్ళు బిఆర్‌ఎస్ అఘాయిత్యాలపై తాము పోరాటం చేస్తే, ఇప్పుడు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను పక్కన కూర్చోపెట్టుకోవాలా? అని ఆయన ఆగ్రహంగా ప్రశ్నించారు. తాను చెబుతున్న అభిప్రాయమే లక్షలాది మంది పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్నదని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు ఆకర్షితున్ని అయి కాంగ్రెస్‌లో చేరుతున్నానని చెప్పిన వ్యక్తి, మళ్లీ తాను పార్టీ మారలేదని, బిఆర్‌ఎస్‌లోనే ఉన్నానని అఫిడవిట్ ఇచ్చారని జీవన్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని తాను ఇటీవల పిసిసి అధ్యక్షునికి చెప్పినా ప్రయోజనం కనిపించలేదన్నారు.
ఆవేదనను అర్థం చేసుకున్నాః మహేష్‌కుమార్
ఇదిలాఉండగా సమావేశం ముగిసిన అనంతరం జీవన్ రెడ్డి వాకౌట గురించి మీడియా ప్రతినిధులు పిసిసి చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్‌ను ప్రశ్నించగా, ఈ విషయంలో ఇప్పుడు తాను ఏమీ మాట్లాడనని, పార్టీయే సుప్రీం అని అన్నారు. జీవన్ రెడ్డి ఆవేదనను తాను అర్థం చేసుకున్నానని ఆయన చెప్పారు.
ప్రతిష్టాత్మకంగా తీసుకోండిః మంత్రి
ఇదిలాఉండగా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికలను పార్టీలో ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తక్కువ స్థానాల్లోనే గెలుపొందామని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామన్నారు. కాబట్టి ఇదే ఊపును మున్సిపల్ ఎన్నికల్లోనూ చూపించాలని ఆయన సూచించారు. పార్టీలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కష్టపడితే తప్పకుండా మంచి ఫలితాలు సాధించుకోవచ్చన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టిందని, వీటని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే తప్పకుండా ్ర పజలు ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
మరింత ఉధృతంగా ఉద్యమించండి..
జూమ్ మీటింగ్‌లో మీనాక్షి, మహేష్
ఇదిలాఉండగా బుధవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పార్టీ అధ్యక్షుడు బి. మహేష్‌కుమార్ గౌడ్, జిల్లా పార్టీ అధ్యక్షులతో, ఇతర ముఖ్య నాయకులతో జూమ్ మీటింగ్ ద్వారా మాట్లాడారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడంపై చేపట్టిన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని మీనాక్షి, మహేష్‌కుమార్ గౌడ్ సూచించారు. యుపిఏ హయాంలో చేపట్టిన ఈ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని వారు విమర్శించారు.