
న్యూఢిల్లీ: డబ్ల్యూపిఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు అదరగొడుతోంది. ఓటమి అనేదే లేకుండా దూసుకుపోతోంది. నిన్న(సోమవారం జనవరి 19) వడోదర కోటంబిలోని బీసీఏ స్టేడియంలో జరిగిన తమ ఐదవ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబి రికార్డును సృష్టించింది. దీంతో ఈ సీజన్‌లో వరుసగా ఐదవ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రస్తుత సీజన్‌లో ఓటమి ఎరుగని ఏకైక జట్టు ఇదే.
ఈ విజయంతో ఆర్‌సిబి 10 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ క్రమంలో ఆర్‌సిబి డబ్ల్యూపీఎల్‌లో అరుదైన రికార్డును సాధించింది. డబ్ల్యూపీఎల్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచిన తొలి జట్టుగా ఆర్‌సిబి నిలిచింది. గత సీజన్ 2024-25లోనూ ఆర్సీబి జట్టు వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచింది. ఇలా వరుసగా ఐదు విజయాలు సాధించిన మరో జట్టు ముంబై ఇండియన్స్ మాత్రమే. ఆ జట్టు కూడా రెండుసార్లు(2023, 2023/24) ఈ ఘనతను సాధించింది. ఇప్పుడు ఆ రికార్డును ఆర్సీబి అదిగమించింది.ఈ సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ విజయం సాధించిన ఆర్‌సిబి.. గత సీజన్‌లో తమ చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచి 2025 సీజన్‌ను ముగించింది. దీంతో వరుసగా ఆరు మ్యాచ్ లను గెలిచిన తొలి జట్టుగా ఆర్సీబి రికార్డు నెలకొల్పింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఆర్‌సిబి బ్యాటర్లలో గౌతమి నాయక్ 55 బంతుల్లో 73 పరుగులు చేసింది. రాధా యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి 8 బంతుల్లో 17 పరుగులు చేయడంతో బెంగళూరు జట్టు భారీ స్కోరు సాధించింది. తర్వాత 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు.. 117/8కే పరిమితమైంది. దీంతో ఆర్‌సిబి 61 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్ కు చేరుకుంది.