
చెన్నై: తమిళనాడులో తెన్‌పెన్నై నదీ ఉత్సవంలో విషాదం చోటుచేసుకుంది. కళ్లకురిచి జిల్లాలోని మనలూరుపేటలో సోమవారం జరిగిన ఈ ఉత్సవంలో ప్రమాదవశాత్తు హీలియం సిలిండర్ పేలడంతో ఒకరు మరణించగా, మరో 18 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఫైరింజన్ తో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు, ఫోరెన్సిక్ టీమ్.. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు.
ఈ ప్రమాదంపై స్పందించిన ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలిపారు. “కళ్లకురిచి జిల్లాలోని మనలూరుపేటలో జరిగిన నదీ ఉత్సవంలో బెలూన్‌లలో గాలి నింపడానికి ఉపయోగించే హీలియం గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారని, పలువురు తీవ్రంగా గాయపడ్డారని తెలిసి నేను తీవ్రంగా చెందాను. మృతుడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారందరూ త్వరగా కోలుకుని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని ఎక్స్‌లో పళనిస్వామి పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి, గాయపడిన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తగిన పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.