Reading Time: < 1 minute

మనతెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు, మున్సిపల్ ఎన్నికలతో పాటు అంశాలపై బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చర్చించారు. ఈ మేరకు శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో కెసిఆర్‌తో కెటిఆర్ సమావేశమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు అడిగే ప్రశ్నలు, సమాధాలు ఇచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం.

కెసిఆర్‌కు సిట్ ఇచ్చే నోటీసులను ఎలా ఎదుర్కోవాలి, ఈ విషయాన్ని పార్టీకి నష్టం కలగకుండా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి..? అనే అంశంపై గురువారం బిఆర్‌ఎస్ ముఖ్యనేత హరీష్‌రావుతో చర్చించగా, శుక్రవారం కెటిఆర్‌తో చర్చించినట్లు తెలిసింది. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి చేపట్టే కార్యక్రమాలు, ఎలాంటి ప్రజా ఉద్యమాలను నిర్మించాలనే అంశాలపై చర్చించినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలనే అంశంపై సుధీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది.