
ఫిబ్రవరి 12వ తేదీన దేశ వ్యాప్తంగా జరుగుతున్న జాతీయ సమ్మెకు తెలంగాణ ఎన్జీఓల సంఘం మద్ధతు ఇస్తుందని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్‌జిఈఎఫ్) జాతీయ ఉపాధ్యక్షుడు టిఎన్జీఓ సంఘ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ముజీబ్‌హుస్సేనీలు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతున్నారని కేంద్రం తీసుకుంటున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఈ పోరాటాలు చేస్తున్నామని వారు తెలియజేశారు. అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య 18వ జాతీయ సమావేశాలు మహారాష్ట్రలోనీ షిర్డీలో మూడురోజుల పాటు జరిగాయి. ఈ సమావేశంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్న 28 రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ తరపున మారం జగదీశ్వర్, ముజీబ్‌హుస్సేనీలు పాల్గొని దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.
దేశవ్యాప్తంగా ఉద్యోగ,ఉపాధ్యాయ కార్మిక వర్గాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఈ సమావేశంలో చర్చించి వాటి పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని తీర్మానించారు. సమావేశాల అనంతరం జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గంలో భాగంగా అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్‌జిఈఎఫ్) జాతీయ ఉపాధ్యక్షుడిగా టిఎన్జీఓ సంఘ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, జాతీయ కార్యవర్గ సభ్యులుగా ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం హుస్సేనీ ముజీబ్‌హుస్సేనీ, కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణ గౌడ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశాలు జాతీయ అధ్యక్షుడు సుభాష్ లాంబ, ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ శ్రీ కుమార్ నేతృత్వంలో జరిగాయి. తెలంగాణ నుంచి నలుగురికి జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించినందుకు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.