Reading Time: 2 minutes
‘పాక్‌పై దాడి చేయడానికి మేము నిమిషాల దూరంలో ఉన్నాం’: ఆపరేషన్ సింధూర్‌పై నేవీ చీఫ్

ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి భారత నావికాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి కీలక విషయాన్ని వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సముద్రం నుండి పాకిస్థాన్‌పై దాడి చేయడానికి భారత నౌకాదళం కొన్ని నిమిషాల దూరంలో ఉందని అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి అన్నారు. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, “సైనిక చర్యను నిలిపివేయండి” అంటూ పాకిస్తాన్ పిలుపునిచ్చిన కొద్ది నిమిషాలకే పాకిస్థాన్‌పై సముద్ర మార్గం ద్వారా దాడి చేయడానికి భారత నావికాదళం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రారంభించిన ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఇద్దరు ఉన్నత నావికాదళ అధికారులకు ‘యుద్ధ సేవా పతకం’ ప్రదానం చేశారు. బుధవారం (ఏప్రిల్ 01) ముంబైలో జరిగిన నావికాదళ పురస్కార ప్రదానోత్సవంలో భారత నావికాదళ సిబ్బందికి శౌర్య, విశిష్ట సేవా పురస్కారాలను ప్రదానం చేస్తూ అడ్మిరల్ త్రిపాఠి ప్రసంగించారు. భారత నావికాదళ పాత్ర గురించి కీలక ప్రకటన చేశారు “ఆపరేషన్ సింధూర్ సమయంలో సైనిక చర్యను నిలిపివేయమని పాకిస్తాన్ అభ్యర్థించినప్పుడు, నిమిషాల వ్యవధిలోనే మేము సముద్రం నుండి వారిపై దాడి చేయడానికి సిద్ధమయ్యామన్నది ఇప్పుడు రహస్యం కాదు” అని ఆయన అన్నారు.

ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్‌పై దాడి చేయడానికి నౌకాదళం పూర్తి అప్రమత్తతతో, సన్నద్ధంగా ఉంది. దీనిని బట్టి, ఒకవేళ పరిస్థితి మరింత తీవ్రమై ఉంటే, వాయుసేనతో పాటు భారత సైన్యం, నౌకాదళం కూడా ఆ సైనిక చర్యలో పాలుపంచుకుని ఉండేవని ఆయన అన్నారు. అపరేషన్ సింధూర్ సమయంలో వేగవంతమైన, దృఢమైన చర్యల ద్వారా, భారత నావికాదళం తన సామర్థ్యాలపై దేశానికి విశ్వాసాన్ని, నమ్మకాన్ని మరింత బలోపేతం చేసిందని ఆయన అన్నారు. అయితే, అప్పటికే పాకిస్థాన్ పూర్తిగా లొంగిపోయి కాల్పుల విరమణ కోసం వేడుకుంటోందని నావీ చీఫ్ త్రిపాఠి తెలిపారు.

ఇదిలావుంటే, 2025 ఏప్రిల్ 26న, పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు పహల్గామ్‌లో ఉగ్రదాడికి పాల్పడి 26 మందిని హతమార్చారు. ఈ దాడి తరువాత, భారతదేశం ‘ఆపరేషన్ సింధూర్’ను ప్రారంభించి ప్రతీకారం తీర్చుకుంది. మే 6-7 తేదీల్లో రాత్రి, భారత వైమానిక దళం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి ప్రవేశించి ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్‌లు, ఆయుధాలను నాశనం చేయడమే ఈ సైనిక చర్య ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఆపరేషన్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.

ఆపరేషన్ సిందూర్‌తో కలవరపడిన పాకిస్థాన్, ఎదురుదాడికి ప్రయత్నించింది. వారు ఏమీ చేయకముందే భారత వాయు రక్షణ వ్యవస్థలు దాని క్షిపణులను, డ్రోన్‌లను ధ్వంసం చేశాయి. అయినప్పటికీ, భారతదేశ క్షిపణులు దాని అనేక వైమానిక స్థావరాలను నాశనం చేశాయి. లాహోర్‌లో మోహరించిన చైనా వాయు రక్షణ వ్యవస్థ అయిన హెచ్‌క్యూ-9 కూడా ధ్వంసమైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..