
దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో, పెరుగుతున్న విమాన ఇంధన (ATF) ధరల నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఇంధన ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి (ఏప్రిల్ 2) నుంచి కొత్త బుకింగ్‌లపై ఈ పెంపు అమల్లోకి రానుంది. గత ఒక నెలలో విమాన ఇంధన ధరలు 130 శాతం కంటే ఎక్కువగా పెరిగినట్లు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) పేర్కొనడంతో, విమానయాన రంగంపై ఖర్చుల ఒత్తిడి గణనీయంగా పెరిగింది.
అయితే ప్రయాణికులపై భారాన్ని తగ్గించే ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచ్యురల్ గ్యాస్ పరిమిత పెంపుకే అనుమతి ఇచ్చాయి. దేశీయ విమాన సర్వీసులపై గరిష్టంగా 25 శాతం వరకు మాత్రమే ఇంధన ఛార్జీల పెంపును అనుమతించడం జరిగింది. ఇండిగో ప్రకటించిన తాజా ఛార్జీల ప్రకారం.. ప్రయాణ దూరాన్ని ఆధారంగా చేసుకుని ధరలు నిర్ణయించారు. 500 కిలోమీటర్ల వరకు రూ.275, 501 నుంచి 1000 కి.మీ వరకు రూ.400, 1001 నుంచి 1500 కి.మీ వరకు రూ.600, 1501 నుంచి 2000 కి.మీ వరకు రూ.800, 2000 కి.మీ పైబడితే రూ.950 వరకు ఇంధన ఛార్జీలు వర్తిస్తాయి.
అంతర్జాతీయ విమానాల విషయంలో కూడా ఛార్జీలు పెరిగాయి. భారత ఉపఖండంలో 500 కి.మీ వరకు ప్రయాణాలకు రూ.900, దాని కంటే ఎక్కువ దూరాలకు రూ.2,500 వసూలు చేయనున్నారు. గల్ఫ్, మధ్యప్రాచ్య దేశాలకు రూ.3,000 నుంచి రూ.5,000 వరకు, ఆగ్నేయాసియా, చైనా ప్రాంతాలకు రూ.3,500 నుంచి రూ.5,000 వరకు ఛార్జీలు నిర్ణయించారు. ఆఫ్రికా మార్గాలకు రూ.5,000, గ్రీస్, టర్కీకి రూ.7,500, యూకే, యూరప్ ప్రయాణాలకు రూ.10,000 వరకు అదనపు ఇంధన ఛార్జీలు అమలు చేయబడుతున్నాయి. ఇంధన ధరల భారీ పెరుగుదల ఉన్నప్పటికీ, ఆ పూర్తి భారాన్ని ప్రయాణికులపై మోపలేదని ఇండిగో తెలిపింది. పరిమిత స్థాయిలో పెంపులు అమలు చేయడం ద్వారా టిక్కెట్ ధరలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..