Reading Time: < 1 minute

ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా గువాహటి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టి-20లో భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. తొలుత బౌలింగ్‌లో ప్రత్యర్థి జట్టును 153 పరుగులకే కట్టడి చేసిన టీం ఇండియా ఆ తర్వాత ఆ లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే చేధించింది. దీంతో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ని 3-0 తేడాతో కైవసం చేసుకుంది. అయితే భారత జట్టులో సంజూ శాంసన్ మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న సంజూ.. చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు.

తొలి టి-20లో 10 పరుగులు, రెండో టి-20లో 6 పరుగులు చేసి ఔట్ అయిన సంజూ.. మూడో మ్యాచ్‌లో ఏకంగా తొలి బంతికే ఔటై.. గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో జట్టులో అతడి స్థానంపై సందిగ్ధత నెలకొంది. అయితే ఈ క్రమంలో సంజూ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టి-20ల్లో భారత్ తరఫున అత్యధిక గోల్డెన్ డక్‌లుగా వెనుదిరిగిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరాడు. దీంతో విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. విరాట్ మొత్తం ఏడుసార్లు గోల్డెన్ డక్‌ కాగా.. సంజూ కూడా 7 సార్లు తొలి బంతికే ఔట్ అయ్యాడు. విరాట్‌ ఈ అవాంఛిత రికార్డును చేరుకునేందుకు 117 మ్యాచ్‌లు తీసుకుంటే, శాంసన్‌ కేవలం 47 మ్యాచ్‌ల్లోనే ఈ అపవాదును మూటగట్టుకున్నాడు. ఈ లిస్ట్‌లో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. రోహిత్ 151 మ్యాచుల్లో మొత్తం 12 సార్లు గోల్డెన్‌ డక్‌ ఔట్ అయ్యాడు.