Reading Time: 2 minutes

లిక్కర్ ఆమ్దానీ రూ. 40 వేల కోట్లు… ఏడేండ్లలో డబుల్.. రాష్ట్ర ఖజానాకు మస్తు కిక్కు

Caption of Image.
  • దరఖాస్తుల  ఫీజులతో కాసుల వర్షం 
  • 2025–26లో రికార్డు స్థాయికి చేరిన ఎక్సైజ్ రాబడి

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదాయం సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 40 వేల కోట్ల మైలురాయిని అధిగమించింది. 2025-–26 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్​ శాఖ రూ. 40,209 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మద్యం అమ్మకాలు, వాటిపై వ్యాట్‌‌‌‌తో కలిపి ఈ మొత్తం వచ్చింది.  గత ఏడేండ్ల కాలంలోనే ఈ ఆదాయం రెట్టింపు కావడం గమనార్హం. 2024-–25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి అదనంగా రూ. 2,722 కోట్ల మేర విక్రయాలు పెరిగి, సుమారు 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. 

2018–-19 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ. 20,859 కోట్లు ఉండగా, 2025-–26 నాటికి అది రూ. 40,209 కోట్లకు చేరుకున్నది. అంటే కేవలం ఏడేండ్ల వ్యవధిలోనే ఆదాయం వంద శాతం పెరగడం విశేషం.  అంతకుముందు రూ. 37,487 కోట్లుగా ఉన్న అమ్మకాలు, ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి   40 వేల కోట్ల మార్కును దాటాయి.

లిక్కర్ పైపైకి.. బీరు డౌన్!

మద్యం వినియోగం తీరును పరిశీలిస్తే, లిక్కర్ అమ్మకాలు స్వల్పంగా పెరగ్గా, బీర్ల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. 2025-–26లో 382.91 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడవగా, నిరుడితో పోలిస్తే ఇది 2 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే, బీర్ల అమ్మకాలు గతేడాది 536.13 లక్షల కేసులు ఉండగా, ఈ సారి 387.34 లక్షల కేసులకు పడిపోయి 9 శాతం మేర తగ్గుదల కనబరిచాయి. నెలవారీ అమ్మకాల్లో డిసెంబర్ నెల రూ. 5,051 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా, అక్టోబర్ నెల రూ. 2,709 కోట్లతో కింది స్థాయిలో ఉంది. 

కేవలం మద్యం అమ్మకాలే కాకుండా, లైసెన్స్ ఫీజులు, దరఖాస్తుల రూపంలోనూ ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులు సమకూరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం షాపుల ద్వారా వార్షిక రెంటల్ ఫీజు రూపంలో రూ. 1,771 కోట్లు, 1,214 బార్ల ద్వారా రూ. 549 కోట్ల ఆదాయం వచ్చింది. 

వీటికి తోడు, మద్యం దుకాణాల కేటాయింపు కోసం వచ్చిన 95,628 దరఖాస్తుల ద్వారా అదనంగా రూ. 2,869 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి చేరింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎక్సైజ్ ఆదాయం  పెరుగుతూ వస్తున్నది.  2015-–16లో రూ. 12,706 కోట్లుగా ఉన్న ఆదాయం, పదేండ్ల కాలంలో 3 రెట్లు పెరిగింది. 2021–22లో రూ. 30,783 కోట్లుగా ఉన్న ఆదాయం, ఆ తర్వాత వరుసగా 35 వేల కోట్లు, 37 వేల కోట్లు దాటుకుంటూ ఇప్పుడు సరికొత్త రికార్డును చేరుకున్నది.

©️ VIL Media Pvt Ltd.