
“వాటర్ ఫాస్టింగ్ అనేది హెల్త్ హ్యాక్ కాదు, అది నియంత్రిత స్వీయ-నష్టం” అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల స్వల్పకాలికంగా బరువు తగ్గినట్లు అనిపించినా, దీర్ఘకాలికంగా మెటబాలిజంపై ఎటువంటి సానుకూల ప్రభావం ఉండదు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఇలాంటి ప్రయోగాలు చేయడం ఏమాత్రం మంచిది కాదు.
తక్కువ సమయంలో బరువు తగ్గే ఈ పద్ధతి వెనుక ఉన్న ప్రమాదాల గురించి ప్రముఖ భారతీయ రోబోటిక్, బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ అన్షుమన్ కౌశల్ హెచ్చరిస్తున్నారు. ఇది ఆరోగ్యకరమైన మార్గం కాదని, అవగాహన లేకుండా చేసే ఇటువంటి ప్రయోగాలు శరీరాన్ని ప్రమాదంలో పడేస్తాయని ఆయన వివరిస్తున్న ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం..
మూడు కీలక దశలు
- రెడ్ లైట్ (ప్రమాద వలయం)- టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారు, బలహీనంగా లేదా పోషకాహార లోపంతో ఉన్నవారు, క్రమం తప్పకుండా మందులు వాడేవారు వాటర్ ఫాస్టింగ్ జోలికి అస్సలు వెళ్లకూడదు. ఇది వారికి ప్రయోగం కాదు, ఒక పెద్ద ప్రమాదం అవుతుంది.
- ఎల్లో లైట్ (జాగ్రత్త)- బరువు తగ్గడం లేదా బీపీ తగ్గించుకోవడమే లక్ష్యమైనా, ముందుగా ల్యాబ్ టెస్టులు చేయించుకోవాలి. ముఖ్యంగా ‘రీఫీడింగ్ ప్లాన్’ (ఉపవాసం తర్వాత ఆహారం తీసుకునే పద్ధతి) చాలా ముఖ్యం. ఉపవాసం ఉండటం సులభమే కానీ, తిరిగి ఆహారం తీసుకునే విధానమే శాస్త్రీయమైనది.
- గ్రీన్ లైట్ (సలహా)- మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నా కూడా, దీనిని సొంతంగా (DIY) ప్రయత్నించవద్దు. ఎందుకంటే ఇందులో రిస్క్ సున్నా కాదు. ఒక స్పష్టమైన కారణం, సరైన ఎగ్జిట్ ప్లాన్ ఉండాలి.
దుష్ప్రభావాలు
మొదటి మూడు రోజులు గ్లైకోజెన్ తగ్గి నీటి బరువు తగ్గుతుంది, ఇది మనకు గెలిచినట్లు అనిపిస్తుంది. కానీ మూడో రోజు నుండి కీటోసిస్ పెరిగి, కండరాల క్షీణత మొదలవుతుంది. ఉపవాసం తర్వాత ఒక్కసారిగా ఆహారం తీసుకోవడం వల్ల ఎలక్ట్రోలైట్స్ పడిపోయి, గుండె లయ తప్పడం, నరాల సమస్యలు రావచ్చు. ఇది ఒక్కోసారి ఐసీయూలో చేరే పరిస్థితిని కలిగిస్తుంది. విపరీతమైన నీరసం, తలనొప్పి, డీహైడ్రేషన్, యూరిక్ యాసిడ్ పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
ప్రత్యామ్నాయాలు
శరీరాన్ని హింసించడం క్రమశిక్షణ కాదు, దాని వ్యవస్థను అర్థం చేసుకోవడమే అసలైన క్రమశిక్షణ. వాటర్ ఫాస్టింగ్‌కి బదులుగా కింది పద్ధతులను పాటించవచ్చంటున్నారు నిపుణులు.
- సాత్విక ఆహారం లేదా మెడిటరేనియన్ డైట్ తీసుకోవడం.
- సమయానుకూల భోజనం .
- సరైన మోతాదులో ప్రోటీన్ తీసుకోవడం, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం.
వాటర్ ఫాస్టింగ్ అనేది ఒక క్లినికల్ టూల్ మాత్రమే, అది ఒక జీవనశైలి కాదు. ప్రాణాలతో చెలగాటం ఆడే సోషల్ మీడియా ట్రెండ్స్ కంటే, శాశ్వతమైన, ఆరోగ్యకరమైన పద్ధతులే మనల్ని ఫిట్‌గా ఉంచుతాయి. ఏదైనా చేసే ముందు మీ డాక్టర్‌ను సంప్రదించడం మర్చిపోవద్దు.