Reading Time: < 1 minute

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సౌత్ 24 పరగణాల జిల్లాలోని నజీరాబాద్ ప్రాంతంలో సోమవారం ఒక గిడ్డంగిలో సంభవించిన అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవదహనమైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. నరేంద్రపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేూసుకుంది. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. పన్నెండు అగ్నిమాపక యంత్రాలతో దాదాపు 7గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

పోలీస్, అగ్నిమాపక దళ బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టి కాలిపోయిన ముగ్గురి మృతదేహాలను వెలికితీశాయని.. మృతులను ఇంకా గుర్తించలేదని బరుయ్‌పూర్ పోలీస్ జిల్లా ఎస్పీ శుభేందు కుమార్ తెలిపారు. ఈ ప్రమాదంలోఆరుగురు వ్యక్తులు తప్పిపోయినట్లు చెప్పారు. ప్రస్తుతం శిథిలాలు తొలగిస్తున్నారని.. పూర్తిగా తొలగించబడిన తర్వాత ఎంతమంది వాటి చిక్కుకున్నారో తెలుస్తుందని పేర్కొన్నారు.

ఘటనా స్థలాన్ని సందర్శించిన విద్యుత్ మంత్రి అరూప్ బిశ్వాస్ మాట్లాడుతూ.. దట్టమైన పొగ కారణంగా గిడ్డంగి లోపల మరెవరైనా ఉన్నారో లేదో ధృవీకరించడం కష్టమైందని…పొగను బయటకు పంపడానికి గోడలను పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.