Reading Time: < 1 minute

చెన్నై: తమిళ సినీ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు లోకేశ్ కనకరాజ్. ముఖ్యంగా ‘విక్రమ్’, ‘ఖైదీ’ తదితర చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో త్వరలో సినిమా చేసేందుకు సిద్ధమైపోయాడు. ఈ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, ఈ కాంబోలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సినిమా వస్తుందని ప్రకటన రావడంతో అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్.. ఇటు లోకేశ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే లోకేశ్ సంబంధించి ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చింది. ‘ఖైదీ-2’ సినిమా కోసం లోకేశ్ భారీగా పారితోషికం డిమాండ్ చేశాడని.. అందుకే ఆ సినిమా ఆగిపోయిందని పుకార్లు పుట్టుకొచ్చాయి.

ఈ రూమర్స్‌కి లోకేశ్ చెక్ పెట్టాడు. ‘ఖైదీ-2 కోసం కార్తి ఇచ్చిన డేట్స్‌ను మరో దర్శకుడు తీసుకున్నాడని. అందుకే ఆ గ్యాప్‌లో అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నట్లు లోకేశ్ తెలిపాడు. ఆరేళ్ల క్రితమే ‘మైత్రీ మూవీ మేకర్స్‌’కి తాను కమిట్‌మెంట్ ఇచ్చినట్లు వెల్లడించాడు. ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్(ఎల్‌సియు)’లో భాగంగా ‘ఖైదీ-2’, ‘విక్రమ్-2’ సినిమాలు ప్రకటించిన లోకేశ్ ఇప్పుడు సడెన్‌గా అల్లు అర్జున్‌తో సినిమాకి కమిట్ కావడంతో ఎల్‌సియు ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన దర్శకుడు త్వరలోనే సినిమాటిక్ యూనివర్స్ మొదలు పెడతానని స్పష్టం చేశాడు. తాను కథ అందించిన ‘బెంజ్’ సినిమా కూడా ‘ఎల్‌సియు’లో భాగమే అని తెలిపాడు. రాఘవ లారెన్స్ హీరోగా భాగ్యరాజ్ కన్నన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ‘ఎల్‌సియు’ సినిమాలు, ‘రోలెక్స్’ తప్పక తెరకెక్కిస్తానన్నారు.