
అభిషేక్ శర్మ ఊచకోత 14 బంతుల్లో అర్ధ సెంచరీ
చెలరేగిన సూర్యకుమార్ బుమ్రా మ్యాజిక్ మూడో
టీ20లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం మరో
రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్ కైవసం
గౌహతి: న్యూజిలాండ్‌తో ఆదివారం గౌహతిలో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా మరో రెండు మ్యాచ్‌లు మిగిలివుండగానే 30తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ముందుకు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 10 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ సంజు శాంసన్ ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి మరో ఓపెనర్ అభిషేక్ శర్మ స్కోరును పరిగెత్తించాడు. ఇషాన్ ఈసారి కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు.
ఇటు ఇషాన్ అటు అభిషేక్ దూకుడును ప్రదర్శించడంతో భారత్ స్కోరు 3 ఓవర్లలోనే 50కి చేరింది. అయితే 13 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 28 పరుగులు చేసిన ఇషాన్‌ను ఐష్ సోధి వెనక్కి పంపాడు. దీంతో 53 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత అభిషేక్ చెలరేగి ఆడాడు. అతనికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అండగా నిలిచాడు. ఇద్దరు పోటీ పడి ఆడడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఈ క్రమంలో టి20లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో యువరాజ్ 12 బంతుల్లో ఈ మార్క్‌ను సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన అభిషేక్ 20 బంతుల్లోనే ఏడు ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ 26 బంతుల్లో ఆరు ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 57 పరుగులు చేశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. బుమ్రా మూడు, బిష్ణోయ్, హార్దిక్ రెండేసి వికెట్లను తీశారు. కివీస్ బ్యాటర్లలో ఫిలిప్స్ (48), చాప్‌మన్ (32) పరుగులు చేశారు.