
అవకతవకలు జరిగింది కేవలం రూ.3.90 కోట్లే
త్వరలో 31 జిల్లాల్లో ఫోరెన్సిక్ భూ ఆడిట్
రాష్ట్రంలో 413 రెవెన్యూ గ్రామాల్లో భూ సర్వేకి ఆదేశం
పాత పద్ధతులకు స్వస్తి.. ఆధునిక ‘రోవర్స్’తో సర్వే చేస్తాం
రెవెన్యూ మంత్రి పొంగులేటి
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ధరణిలోని లోసుగుల వల్లే భూరిజిస్ట్రేషన్ ఫీజులో గోల్‌మాల్ చోటుచేసుకుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శిక్షణ పూర్తి చేసుకున్న లైసైన్స్ డ్ సర్వేయర్లకు ఆయన నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడ్తూ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఫీజు విషయంలో భూ భారతి చట్టంద్వారా అవకతవకలు జరిగినట్లు ప్రతిపక్ష నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రతిపక్షంలో ఉండే ఒక శాసనసభ్యుడు 1000 కోట్లు అవినీతి జరిగిందని, ఇంకో మాజీ మంత్రి 1000 కోట్లు జరిగిందని,మరోమాజీ మంత్రి రూ 1500 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని.. కానీ ఈ అవకతవకలు భూభారతి వచ్చిన తర్వాత జరగలేని, గత ప్రభుత్వంలోని ధరణి హయంలోనే జరిగాయని మంత్రి స్పష్టం చేశారు.
రిజిస్ట్రేషన్ ఫీజు అవకతవకలపై అనుభవం ఉన్న వారితో ఒక ప్రత్యేకమైన కమిటీని వేశామని… నిన్ననే దానిమీద రివ్యూ చేశామన్నారు. సమీక్ష తర్వాత ఏవైతే అవకతవకలు జరిగాయని ప్రతిపక్షం అంటున్నారో దానికి ప్రధానమైన సూత్రధారుడు, పాత్రధారులు ఆనాడు ధరణిలో ఉండే లొసుగులే అనేది స్పష్టంగా తేలిందని మంత్రి పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు అన్నట్టు 1000 కోట్లో, 1500 కోట్లో కాదు, నాకు తెలిసినంత వరకు నా దగ్గర ఉన్న లెక్క వరకు కేవలం రూ.3 కోట్ల 90 లక్షల వరకు మాత్రమే అవకతవకలు జరిగాయన్నారు.
త్వరలో 31 జిల్లాల్లో ఫోరెన్సిక్ భూ ఆడిట్
ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వంలోని పెద్దలు ప్రభుత్వ భూములను కాజేశారని, దీనిపై సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్ధతో పైలట్ కింద ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించడం జరిగిందని ఇందులో అనేక అవినీతి అక్రమాలు జరిగినట్లు ప్రాధమిక నివేదికలో స్పష్టమైందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ ఫోరెన్సిక్ నివేదికను పరిశీలించిన తర్వాత మిగిలిన 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.
రాష్ట్రంలో 413 గ్రామాల్లో భూ సర్వే
రాష్ట్ర వ్యాప్తంగా నక్షాలు లేని 413 గ్రామాలలో పైలెట్ ప్రాజెక్టు క్రింద మొదటి విడత క్రింద సర్వే పనులను చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.ఇందుకుగాను ప్రతి జిల్లా నుంచి 70 రెవెన్యూ గ్రామాలను గుర్తించామని ఇప్పటికే జిల్లాల నుంచి ప్రభుత్వానికి భూనక్షలు లేని రెవెన్యూ గ్రామాల పేర్లు ప్రభుత్వానికి చేరాయన్నారు. ఇప్పటి వరకు నియమించిన లైసెన్స్ సర్వేయర్లు ద్వారా భూ సర్వే చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. భూ సర్వేను విడతల వారీగా పూర్తి చేసి భూముల మ్యాప్ తో కలిసి ప్రతి ఏకరాకు భూ దార్ నెంబర్ లను అందిస్తామన్నారు.