
కాంగ్రెస్ ఓడిపోయే పార్టీ… నేనెందుకు ఆ పార్టీలో చేరతాను
నేను కాంగ్రెస్‌లో చేరతానని మహేష్ గౌడ్‌కు ఏమైనా కల వచ్చిందా..?
ఎన్నికల్లో జాగృతి గెలువబోతుంది
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
మనతెలంగాణ/హైదరాబాద్ : టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తమ పార్టీలో చేరితే ఆయనకు మంచి పోస్టు ఇస్తానంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆఫర్ చేశారు. మహేశ్ కుమార్ గౌడ్‌ను జాగృతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తనను కాంగ్రెస్‌లో చేర్చుకోమని మీడియా చిట్‌చాట్‌లో మహేష్‌కుమార్ గౌడ్ అన్నట్లు తాను వార్త చూశానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయే పార్టీ అని, తానేందుకు కాంగ్రెస్‌లో చేరతాను..? అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో జాగృతి గెలువబోతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తనను బద్నాం చేసే పనిలో మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారని… తాను కాంగ్రెస్‌లో చేరతానని ఆయనకు ఏమైనా కల వచ్చిందా..? అని ఎద్దేవా చేశారు. ఆయన మానసిక పరిస్థితి చెక్ చేసుకోవాలని హితవు పలికారు. బలమైన రాజకీయ పార్టీగా జాగృతిని మార్చే ప్రయత్నం చేస్తున్నానని కవిత వెల్లడించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
మాజీ మంత్రి హరీష్‌రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. సృజన్ రెడ్డికి కాంట్రాక్టులు ఇప్పించింది హరీశ్ రావు అని, సృజన్‌రెడ్డి పెద్ద తిమింగలంగా మారటానికి ఆయనే కారణం అని పేర్కొన్నారు. సృజన్‌రెడ్డి.. రేవంత్‌రెడ్డి బావమరిది అని హరీశ్‌రావుకు అప్పుడు తెలియదా..? అని ప్రశ్నించారు. హరీష్‌రావు తవ్విన గుంతలో కెటిఆర్ పడటం బాధాకరం అని పేర్కొన్నారు.కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మాత్రమే లేఖ రాస్తానని హరీష్‌రావు అంటున్నారని, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు లేఖ రాయనని హరీష్‌రావు అనటం దళిత ఉప ముఖ్యమంత్రిని అవమానించటమే అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అడగకుండా రాష్ట్రానికి సిబిఐ ఎలా వస్తుంది..? అని ప్రశ్నించారు. 2014 నుంచి జరిగిన సింగరేణి టెండర్లపై విచారణ జరపాలని ఆయన అంటున్నారని, అంటే కెసిఆర్ పాలనపైనా హరీష్‌రావు విచారణ కోరుతున్నట్లే కదా..? అని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.
హరీష్‌రావు బాధ కమీషన్ల కోసమే..
హరీశ్‌రావు లేఖ రాయగానే కిషన్‌రెడ్డి మీటింగ్ పెడుతున్నారని కవిత విమర్శించారు. హరీశ్‌రావు బాధ అంతా ఆయన కమీషన్ల కోసమే అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనకు చెందిన కంపెనీకి సింగరేణి టెండర్ ఎలా వచ్చిందని అడిగారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బొగ్గు గనులను తెలంగాణకు కేటాయించటానికి కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. బిఆర్‌ఎస్ కాంట్రాక్టర్ల పక్షాన మాట్లాడటం బాధాకరం అని పేర్కొన్నారు. జీతాలు ఇవ్వటానికి కూడా సింగరేణి వద్ద నిధులు లేవు అని చెప్పారు.సింగరేణికి చెందిన 25 టెండర్లలో ఎక్కువ బిఆర్‌ఎస్ నేతలకు చెందిన కంపెనీలకే దక్కాయని అన్నారు. ఓబీ వర్క్‌కు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం తీసుకురావడం కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు అని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ల కోసం కాకుండా, సింగరేణి కార్మికుల కోసం తాము పోరాటం చేస్తామని కవిత స్పష్టం చేశారు. మహిళా ఐఎఎస్ అధికారిపై ఇష్టానుసారంగా రాస్తే జర్నలిస్టులకు కెటిఆర్ ఎలా సహకరిస్తారని ప్రశ్నించారు. అదే కెటిఆర్ మీద ఓ ఛానల్ రాస్తే దాడి చేస్తారా..? అని అడిగారు. మహిళ మీద వార్తలు ప్రచురించిన ఛానల్ ప్రతినిదులకు ఎందుకు సహకరిస్తున్నారనేది విడ్డూరంగా ఉందని అన్నారు.