
రెండోరోజూ కొనసాగిన సహాయక చర్యలు
మృతదేహాలు బంధువులకు అప్పగింత
మృతుల బంధువుల ఆందోళన, స్వల్ప ఉద్రిక్తత
మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
ఫర్నిచర్ షాపు యజమాని అరెస్ట్
మనతెలంగాణ/గోషామహల్: నాంపల్లి ఫర్నీచర్ సెల్లార్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన ఐదుగురికి ఉస్మానియా మార్చురీలో ఫ్రొఫెసర్ డాక్టర్ కార్తీక్ నాగుల నేతృత్వంలో వైద్యుబృందం పోస్టుమార్టం నిర్వహించి.. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఆదివారం ఉస్మానియా ఫోరెన్సిక్ బృందం అగ్ని ప్రమాదంలో మరణించిన మహమ్మద్ ఇంతియాజ్ (28), సయ్యద్ హబీబ్ (32), బీరన్ బీ(30), అఖిల్ ( 11), ప్రణీత్ (8)ల మృతదేహాలకు సుమారు 2 గంటల వ్యవధిలో శవ పంచనామా నిర్వహించి.. మృతదేహాలను వాహనాల్లో స్వస్థలాలకు తరలించారు. ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్టు తెలుసుకున్న మృతుల కుటుంబీకులు, బంధువులు పెద్దఎత్తున మార్చురీకి తరలిచారు.
విగతజీవులైన తమవారి మృతదేహాలనుచూసి కన్నీటి పర్యంతమయ్యారు. తమ ఇద్ద రు పిల్లలు అఖిల్ (11), ప్రణీత్ (8)లు స్కూల్‌కు వెళ్లివుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చిన్నారుల తండ్రి యాదయ్య చేసిన రోదనలు అక్క డున్న వారి హృదయాలను కలచివేసింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ రెహమత్ బేగ్ ఉస్మానియా మార్చురీకి చేరుకుని, మృతుల కుటుంబీకులను పరామర్శించారు. ఫోరెన్సిక్ వైద్యులు డాక్టర్ కార్తిక్ నాగులతో చర్చించి త్వరితగతి పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాలను కుటుంబీలకు అప్పగించేలా చర్యలు తీసుకున్నారు. మృతదేహాలను స్వస్థలాలకు తరలిస్తుండగా అఖిల్, ప్రణీత్‌ల బంధువులు వాహనాలను అడ్డుకున్నారు.
ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఇక్కడికి రావాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అప్పటివరకు వాహనాలను కదలనిచ్చేది లేదని భీష్మించారు. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నిస్తూ, హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడికి రావాలని పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్సీ రెహమత్‌బేగ్, పోలీసులు మృతుల బంధువులకు నచ్చజెప్పడంతో శాంతించి ఆందోళనను విరమించి మృతదేహాలను స్వస్థలాలకు తరలించారు. హైదరాబాద్ డీఆర్వో రామకృ ష్ణ, తహశీల్దార్లు నయీముద్దీన్, నిహారిక, ప్రవీణ్, జ్యోతి ఇతర సిబ్బంది మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించడంలో సహకరించారు. శవ పరీక్షల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలె త్తకుండా డీసీపీ చంద్రమోహన్, అఫ్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ నూనావత్ రవి, అబిడ్స్ ఇన్‌స్పెక్టర్ గౌరేందర్ రెడ్డిలు పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు.
నాంపల్లి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఫర్నిచర్ మాల్‌లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ & సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు అమాయ కులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ హరి చందనకు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అగ్నిమాపక నిబంధనలు, భద్రతా ప్రమాణాలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ప్రాథమిక విచారణలో షాపు యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు తేలిందని, సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.