
వాషింగ్టన్/న్యూఢిల్లీ : వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తున్న హెచ్-1బి వీసాదారులకు అమెరికా మరో షాక్ ఇచ్చింది. ఈ ఏడాదికి సంబంధించి ఇంటర్వ్యూ స్లాట్స్ వచ్చే ఏడాదికి వాయిదాపడ్డట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెల్లడిస్తున్నాయి. వీసా బ్యాక్‌లాగ్స్ పెరిగిన నేపథ్యంలో ఇంటర్వ్యూ స్లాట్స్ వచ్చే ఏడాదికి మారినట్టు సమాచారం. ఇప్పటికే వీసా స్టాంపింగ్ కోసం భారత్‌కు వచ్చిన అనేక మంది హెచ్-1బి వీసాదారులకు ఇది అశనిపాతంగా మారినట్టే. దీంతో వేలాది మంది ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. గతేడాది డిసెంబర్‌లో జరగాల్సిన వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు మొదట ఈ ఏడాది మార్చికి వాయిదాపడ్డాయి.
అనంతరం ఈ ఏడాది అక్టోబర్‌లో ఇంటర్వ్యూలు జరుగుతాయన్న వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఇంటర్వ్యూలు ఏకంగా వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయన్న వార్త వారిని తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ పరిణామాలపై అమెరికాలో వలసల వ్యవహారాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 50 రోజుల్లో భారత్‌లో ఒక్క వీసా స్లాట్ కూడా అందుబాటులోకి వచ్చినట్టు తమ దృష్టికి రాలేదని వ్యాఖ్యానించారు. అమెరికాలో ఉంటున్న వారు భారత్‌కు తిరిగెళ్లొద్దని సూచించారు. 2027 వరకూ రెగ్యులర్ అపాయింట్‌మెంట్స్ లేవని ఇమిగ్రేషన్ న్యాయవాది ఒకరు పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిల్లో ఇంటర్వ్యూ స్లాట్స్ పొందిన వారికి వచ్చే ఏడాదిలో కొత్త స్లాట్స్‌ను కేటాయించారని ఆయన వెల్లడించారు.