
తెలంగాణ నుంచి ఏడుగురికి పురస్కారం
ఎపి నుంచి నలుగురికి.. ఢిల్లీ, అమెరికా కోటాలో ఇద్దరికి అవార్డులు
ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
తెలుగు రాష్ట్రాల నుంచి నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, నృత్యకారిణి దీపికారెడ్డి, శాస్త్రవేత్త
తంగరాజ్‌లకు పద్మశ్రీ పురస్కారం
వైద్య రంగంలో గూడూరు వెంకటరావు, విజయ్ ఆనంద్‌రెడ్డి,
సైన్స్‌లో జి.చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్‌లకు అవార్డులు
మరణానంతరం గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, మామిడి రామారెడ్డిలకు గౌరవం
హస్తిన కోటాలో యుజిసి మాజీ ఛైర్మన్ జగదీష్‌కు పద్మశ్రీ
విదేశీ కోటాలో క్యాన్సర్ నిపుణుడు నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ పురస్కారం
మన తెలంగాణ / హైదరాబాద్ : భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించింది. 2026 సంవత్సరానికి గాను గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం రాత్రి పద్మ పురస్కారాల జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 131 మందిని పద్మ అవార్డులు వరించాయి. ఇందులో 5 పద్మ విభూషణ్, 13 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. దేశం కోసం, సమాజం కోసం నిస్వార్థంగా సేవ చేసూ, తమ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి గౌరవించడం ఈ పురస్కారాల ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఏడాది ప్రకటించిన మొత్తం 131 అవార్డుల్లో తెలుగు రాష్ట్రాల నుండి 11 మంది ప్రముఖులు ఎంపికవ్వడం తెలుగు వారందరికీ గర్వకారణం. గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాల ఎంపికలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ప్రచారం కోరుకోకుండా, మారుమూల ప్రాంతాల్లో ఉంటూ సమాజ హితం కోసం పాటుపడే ‘అన్సంగ్ హీరోస్’ (గుర్తింపు లేని వీరులు) కి పెద్దపీట వేస్తోంది. 2026 జాబితాలో కూడా ఇదే స్పష్టంగా కనిపిస్తోంది. పారిశ్రామిక దిగ్గజాలు, కళాకారులతో పాటు, పాడి పరిశ్రమలో మహిళా సహకార సంఘాలను ప్రోత్సహించిన వారు, వైద్య రంగంలో కొత్త పుంతలు తొక్కిన శాస్త్రవేత్తలకు ఈ గౌరవం దక్కడం ఈ అవార్డుల గౌరవాన్ని మరింత పెంచింది.
తెలంగాణ నుండి విశిష్ట సేవకులు
తెలంగాణ నుండి సైన్స్, వైద్యం , సేవా రంగాల్లో 7 మంది నిష్ణాతులు ఎంపికయ్యారు. రామ రెడ్డి మామిడి (మరణానంతరం) పాడి పరిశ్రమ , సహకార రంగంలో ఈయన చేసిన కృషి అనన్యసామాన్యం. మహిళల నేతృత్వంలో సహకార సంఘాలను ఏర్పాటు చేసి వేల మందికి జీవనోపాధిని కల్పించినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. సీసీఎంబీ లో ప్రఖ్యాత శాస్త్రవేత్తగా పనిచేస్తున్న కుమారసామి తంగరాజ్ జెనెటిక్స్ (జన్యుశాస్త్రం) లో చేసిన పరిశోధనలకు గాను అంతర్జాతీయ గుర్తింపు పొందారు. కూచిపూడి నృత్యకారిణిగా భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పినందుకు గాను దీపికా రెడ్డి కళా విభాగంలో ఎంపికయ్యారు. వైద్య , ఇతర రంగాల్లో డాక్టర్ గుడూరు వెంకట రావు , డాక్టర్ పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి వైద్య సేవలకు గాను, అలాగే చంద్రమౌళి గడ్డమనుగు , కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ సైన్స్ రంగంలో చేసిన విశేష కృషికి గాను పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుండి కళా కోవిదుల్లో మాగంటి మురళీ మోహన్,గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా దశాబ్దాల పాటు సేవలు అందించిన వీరికి కళా విభాగంలో పద్మశ్రీ వరించింది. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం) అన్నమాచార్య కీర్తనలను జన బాహుళ్యంలోకి తీసుకెళ్లిన గొప్ప వాగ్గేయకారుడు , గాయకుడు. ఆయన సంగీత సేవలకు గుర్తింపుగా మరణానంతరం ఈ అవార్డు దక్కింది. వెంపటి కుటుంబ శాస్త్రికి సాహిత్యం , విద్యా రంగంలో పద్మశ్రీ లభించింది.
పలువురు ప్రముఖులకు అత్యున్నత గౌరవం
కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాది సినీ రంగానికి చెందిన ఇద్దరు దిగ్గజ నటులకు అరుదైన గౌరవం దక్కింది. దివంగత బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ (మరణానంతరం) లభించగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి పద్మ భూషణ్‌కు ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను గౌరవిస్తూ కేంద్రం ఈ జాబితాను విడుదల చేసింది. పద్మ విభూషణ్ పురస్కారానికి మొత్తం ఐదుగురిని ఎంపిక చేయగా వారిలో కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్‌కు కూడా మరణానంతరం ఈ గౌరవాన్ని ప్రకటించారు. ఇక పద్మ భూషణ్ పురస్కార గ్రహీతల్లో ప్రఖ్యాత గాయని అల్కా యాగ్నిక్, తెలుగు వారికి సుపరిచితులైన క్యాన్సర్ వైద్య నిపుణులు, ఎన్నారై డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఝార్ఖండ్ మాజీ సీఎం షిబు సోరెన్‌కు మరణానంతరం పద్మ భూషణ్ ప్రకటించారు.
సినీ నటులకు ‘పద్మశ్రీ’ పురస్కారాలు
ప్రముఖ సినీ నటులు, నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్‌లకు ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం లభించింది. కళారంగంలో వారు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం వారిని ఈ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్‌లతో పాటు, మరణానంతరం గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (కళలు), వెంపటి కుటుంబ శాస్త్రి (సాహిత్యం, విద్య)లకు పద్మశ్రీ లభించింది. తెలంగాణ నుంచి చంద్రమౌళి గడ్డమనుగు (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), దీపికా రెడ్డి (కళలు), గూడూరు వెంకట్ రావు (వైద్యం) సహా పలువురు ఈ గౌరవాన్ని అందుకున్నారు. కళలు, సామాజిక సేవ, సైన్స్, వాణిజ్యం, వైద్యం, విద్య వంటి వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఏటా ఈ పురస్కారాలను అందజేస్తారు. ఈసారి అవార్డు గ్రహీతలలో 19 మంది మహిళలు, 6 మంది విదేశీ/ఎన్‌ఆర్‌ఐలు ఉండగా, 16 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది. ఈ పురస్కారాలను మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు.
భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్‌కు పద్మశ్రీ
భారత క్రికెట్ రంగానికి చెందిన ప్రముఖ ఆటగాళ్లు రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్‌లను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఇందులో భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు పద్మశ్రీ లభించింది. క్రీడా రంగం నుంచి మరికొందరు ప్రముఖులు కూడా ఈ ఏడాది పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్‌కు దేశంలోని మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ దక్కింది. అదేవిధంగా, భారత మహిళల హాకీ జట్టు క్రీడాకారిణి సవిత పూనియాకు కూడా పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించారు. 2026 సంవత్సరానికి గాను మొత్తం 131 పద్మ పురస్కారాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. కళలు, సామాజిక సేవ, క్రీడలు, సైన్స్, వాణిజ్యం వంటి వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి ఏటా ఈ పురస్కారాలను అందజేస్తారు. ఈసారి క్రీడా రంగానికి చెందిన పలువురికి పద్మ పురస్కారాలు దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.