
టొరంటో : కెనడాలో భారతీయ సంతతి వ్యక్తి దిల్‌రాజ్ గిల్ హత్యకు గురయ్యాడు. గ్యాంగ్ వార్ నేపథ్యంలోనే ఈ ఘటన బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలోని బర్నబేలో జరిగింది. కాల్పుల సంఘటన వివరాల గురించి తెలియగానే స్థానిక పోలీసులు అక్కడికి చేరారు. ఇక్కడ కొన ఊపిరితో ఉన్న దిల్‌రాజ్‌ను చికిత్సకు తరలించేలోగానే చనిపోయినట్లు నిర్థారించారు. మృతుడిని వాంకోవర్ నివాసిగా గుర్తించారు. ఈ ప్రాంతంలో బిసి గ్యాంగ్ వార్ సాగుతోంది. ఈ నెల 22వ తేదీన సాయంత్రం కెనడావేలోని 3700 బ్లాక్ వద్ద కాల్పులు జరిగాయని రాయల్ కెనెడియన్ పోలీసులు తెలిపారు.
ఈ హత్య తరువాత కొద్ది సేపటికి సమీపంలో ఓ రాదారిలో ఓ వాహనం తగులబడి పోతూ ఉండగా పోలీసులు గుర్తించారు. అంతకు ముందు జరిగిన హత్యకు ఈ వాహన దుర్ఘటనకు సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. దిల్‌రాజ్ పోలీసు రికార్డులలో ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో తరచూ జరుగుతోన్న గ్యాంగ్‌వార్ కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు వేగవంతం అయింది. ఈ ఘటనతో స్థానిక భారతీయ సంతతి వారిలో ఆందోళన వ్యక్తం అయింది.