
రాష్ట్రీయ జనతాదళ్‌లో కొత్త శకం ప్రారంభమైనట్టే. తాజా ఆ పార్టీకి జాతీయ కార్యనిర్వాహక అధిపతిగా మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారంనాడు నియమించారు. ‘నూతన యుగారంభం. ఆర్‌జెడి జాతీయ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా తేజస్వి యాదవ్ నియమితు లయ్యారు’ అంటూ ఆర్జేడీ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆర్‌జెడి జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారంనాడిక్కడ ప్రారంభమైంది. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, పార్టీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమావేశంలో తేజస్వి నియామకాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించింది. నియామక పత్రాన్ని తేజస్వికి లాలూ ప్రసాద్ అందజేశారు. లాలూ ప్రసాద్ చిన్నకుమారుడైన తేజస్వి మొదట్నించి లాలూ వారసుడిగా ప్రచారంలో ఉన్నారు. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ గత ఏడాది పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. తాజాగా తేజస్వి కీలక నియామకంతో కుటుంబ వారసత్వాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లనున్నారు.