Reading Time: < 1 minute

ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. జనవరి 24న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు (383 మ్యాచుల్లో 27) గెలుచుకున్న ఆటగాడిగా అరుదైన ఘనతను సాధించాడు. ఈ క్రమంలో కెవిన్ పీటర్సన్ (277 మ్యాచుల్లో 26) రికార్డును రూట్ అధిగమించాడు. ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానాల్లో జాస్ బట్లర్ (24), ఇయాన్ మోర్గన్ (23) ఉన్నారు.

ఇక శ్రీలకంతో జరిగిన మ్యాచ్‌లో రూట్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1 తేడాతో సమంగా ఉంది. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో 75 పరుగులు చేసిన రూట్.. బౌలింగ్‌లో 2.3 ఓవర్లు వేసి 2 వికెట్ల తీశాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఇక సిరీస్ విజేతను నిర్ణయించే చివరి వన్డే జనవరి 27న కొలొంబో వేదికగా జరగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య మూడు టి-20ల సిరీస్ జరుగుతుంది. ఆ తర్వాత శ్రీలంకతో పాటు, భారత్‌లో టి-20 ప్రపంచకప్ మొదలవుతుంది.